జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటానికి బీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆర్టిజన్ల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం ఏడో రోజుకు చేరుకోగా.. వారికి మాజీ మంత్రి మద్దతు పలికి మాట్లాడారు. వారం రోజులుగా ఆర్టిజన్లు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దుర్మర్గమని అన్నారు. అర్జిజన్ల సమస్యలను పరిష్కరించే దాక తమ పార్టీ వారికి మద్దతుగా ఉంటుందన్నారు. పీస్‌రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, అర్హతలున్న ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను గుర్తించాలని, విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పీస్‌రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విద్యుత్ ఎంప్లాయిస్ ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కి, నాయకులు సైదులు, మోయిస్, జెట్టి గోపాల్, పెంటయ్య, తిరుమలేష్, శ్రీనివాసులు, శేఖర్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


