జడ్చర్ల మండలం పోలేపల్లి, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామాల శివారులో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు కోసం సుమారు 1,100 ఎకరాల్లో భూములను సేకరించారు. ఇందులో పోలేపల్లి సెజ్ కోసం 250 ఎకరాలు కేటాయించారు. దీని పరిధిలో ఇప్పటివరకు 12 ఫార్మా, మరో పది వరకు ఇతర పరిశ్రమలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2023లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించిన అప్పటి కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించిన అనంతరం విచారణ బృందం శాఖల వారీగా ఆధారాలతో నివేదిక అందజేసింది. పలు ఫార్మా పరిశ్రమలు వర్షాకాలంలో వరద మాటున రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా చెరువులు, కుంటలు, పొలాల్లోకి వదులుతున్నాయని.. దీంతో పంటలు పండడం లేదని, జలాశయాల్లో చేపలు ఎదగకుండా మృతి చెందుతున్నాయని నివేదికలో పేర్కొంది. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, గుండ్లగడ్డ తండా, గొల్లపల్లి, రాజాపూర్ మండలంలోని రాయపల్లి, ముదిరెడ్డిపల్లి, నందిగామకు చెందిన పలువురు చర్మ, కీళ్ల నొప్పులు, శ్వాసకోశ, మూత్రపిండ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది.


