లక్ష్యం.. ఆరోగ్య బాల్యం | - | Sakshi
Sakshi News home page

లక్ష్యం.. ఆరోగ్య బాల్యం

Apr 16 2026 1:05 PM | Updated on Apr 16 2026 1:05 PM

మహబూబ్‌నగర్‌ రూరల్‌: నేటి బాలలే రేపటి పౌరులు.. చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యం అనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నా పోషణ లోపంతో సతమతమవుతున్న చిన్నారులు ఇప్పటికీ ఉన్నారు. దీన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే పోషణ్‌ పక్షోత్సవాల్లో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 23 వరకు నిర్వహిస్తున్నారు.

‘అమ్మ’ బాధ్యత ప్రధానం

బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం తల్లి పాల ద్వారా చేకూరుతుంది. పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టడం ద్వారా తల్లీ బిడ్డలిద్దరికీ శ్రేయస్కరం. ఆరు నెలల వయసు వరకు అవసరాన్ని బట్టి తల్లిపాలే పట్టించాలి. తల్లి పాలల్లో బిడ్డకు సరిపోయే విటమిన్లు, మినరల్స్‌ ఉండటం ద్వారా శారీరక, మానసిక వికాసం వేగంగా అభివృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితం కారణంగా కొందరు తల్లులు బిడ్డలకు పాలు పట్టే సమయం ఉండటం లేదు. డబ్బాపాలు పట్టడం ద్వారా పిల్లల్లో ఎదుగుదల లోపిస్తోంది. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

● పోషణ లోపంతో వయసు, ఎత్తుకు తగ్గట్టుగా బరువు లేని చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల వారీగా ఇప్పటికే గుర్తించారు. పక్షోత్సవాల్లో ఆయా కేంద్రాల్లో చిన్నారుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తున్నారు. అతి తక్కువ బరువు ఉన్న పిల్లలు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పోషణ సలహా, చికిత్స కేంద్రానికి తరలిస్తారు. అవసరమైన మందులు, సలహాలు అందేలా చూస్తారు. ఇంట్లోనే పౌష్టికాహారం తయారీ విధానాన్ని వివరిస్తారు. పౌష్టికాహార లోపంతో ఆరోగ్యపరంగా తలెత్తే ఇబ్బందులను తెలియజేస్తారు. అవసరమైన చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అదనపు పౌష్టికాహారంతో పాటు ఆయా కేంద్రాల్లోని పెరటి తోటల్లో పండించిన కూరగాయలను ఉచితంగా అందజేస్తారు. బాలామృతం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించడం, పోషకాలపై అవగాహన కల్పిస్తారు.

అంగన్‌వాడీల్లో పోషణ పక్షం

రక్తహీనత నివారణకు చర్యలు

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన

తక్కువ బరువు ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి

Advertisement
 
Advertisement
Advertisement