● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ రూరల్: అంబేడ్కర్ ఆలోచన విధానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన దిశగా ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని మహబూబ్‌నగర్‌లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎస్పీ జానకి, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మేయర్ గుమ్మాల మమత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సాధికారత దిశగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుందని తెలిపారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో మన దేశం పేరు నిలిచిపోయేలా చేసిన మహానీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. 70 ఏళ్ల తర్వాత కూడా దేశ పౌరులంతా ఐక్యంగా ఉన్నారంటే అందుకు అంబేడ్కర్ రచనలే కారణమన్నారు. కార్యక్రమంలో నాయకులు వినోద్‌కుమార్, సిరాజ్ ఖాద్రీతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.


