మహమ్మదాబాద్: ఇకపై అధికారులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా పనిచేయాలని, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. బుధవారం ఆమె మహమ్మదాబాద్‌లోని కేజీబీవీని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరైన పర్యవేక్షణ లేకుండా ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కేజీబీవీ ప్రత్యేకాధికారి పావనిని సస్పెండ్ చేశారు. అలాగే సీఆర్‌టీ ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు శోభ విద్యార్థులకు సరిగా పాఠాలు చెప్పనందుకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. పాఠశాల నైట్ వాచ్‌మెన్ జైతున్‌బేగం తన భర్త ద్వారా నైట్ డ్యూటీ చేయిస్తుండటంతో ఆమెను సస్పెన్షన్ చేశారు. అనంతరం కలెక్టర్ పాఠశాలలోని 7, 8, 9 తరగతుల విద్యార్థుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఉపాధ్యాయులు పాఠాలు సరిగా బోధిస్తున్నారా.. పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉన్నాయి.. మీరు బాగా చదువుతున్నారా.. అని ఆరాతీశారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో తరచుగా పరీక్షలు చేస్తున్నారా అని అడిగారు. అనంతరం డార్మెటరీ రూంలు, మరుగుదొడ్లు, స్టోర్ రూంను పరిశీలించి సూచనలు చేశారు. పప్పు, బియ్యం, నూనె, కూరగాయల స్లాక్ వివరాలను సరిగా నమోదు చేయకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్‌గౌడ్ తదితరులున్నారు.
కేజీబీవీ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
నిర్లక్ష్యం వహించిన ఎస్‌ఓ,
నైట్‌డ్యూటీ వాచ్‌మెన్ సస్పెండ్
పాఠాలు సరిగా చెప్పని ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు


