ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 37 కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న 22,851 మంది విద్యార్థులు
● ఏర్పాట్లు పూర్తిచేసిన
పీయూ అధికారులు
పీయూ ముఖద్వారం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ఈ నెల 16 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 2, 4, 6 సెమిస్టర్లకు సంబంధించి పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడటం.. వారిని అధికారులు డిబార్ చేయడం వంటి చెదురు ముదురు ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారా లేదా అనేది ప్రశ్నగా మిగిలింది.
వేసవి నేపథ్యంలో ప్రత్యేక చర్యలు..
ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న క్రమంలో పరీక్షల నిర్వహణకు పీయూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రాల వద్ద తప్పనిసరిగా తాగునీటి వసతి కల్పించడంతో పాటు విద్యార్థులకు ఓఆర్‌ఎస్ పాకెట్లు, వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల్లోని ప్రతి గదిలో ఫ్యాన్లు, విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండే విదంగా చర్యలు తీసుకుంటున్నారు.
37 పరీక్ష కేంద్రాలు..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా అధికారులు 37 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందులో 18 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 19 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. బీఏ విద్యార్థులు 7,824, బీకాం విద్యార్థులు 7,995 మంది, బీఎస్సీ విద్యార్థులు 7,032 మంది ఉన్నారు. వీరిలో రెగ్యులర్ పరీక్షలు రాసే విద్యార్థులతో పాటు బ్యాక్‌లాగ్ పరీక్షలు రాసే వారు కూడా ఉన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల వద్ద సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడంతో పాటు తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.


