మహబూబ్‌నగర్ రూరల్: అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ సమాజంలో సమానత్వం నెలకొల్పాలని ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని రామచంద్రాపూర్‌లో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అంతకుముందు విగ్రహాన్ని ఆవిష్కరించి అంబేడ్కర్ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ నర్సింహులు, వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
4,750 కిలోల
పత్తి విత్తనాలు పట్టివేత
భూత్పూర్: మండల కేంద్రంలోని పత్తి విత్తనాల కంపెనీలో అనుమతి లేని విత్తనాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన సీడ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కృష్ణ, నాగరాజులు సికాప్ సీడ్స్ కంపెనీ, నవత ట్రాన్స్‌పోర్టులో తనిఖీలు నిర్వహించారు. సికాప్ సీడ్స్ కంపెనీలో కర్ణాటక నుంచి వచ్చిన 4,500 కిలోల పత్తి విత్తానాలకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడం, నవత ట్రాన్స్‌పోర్టులో 250 కిలోల కాలం చెల్లిన విత్తనాలను గుర్తించారు. వీటిని సీజ్ చేసి విత్తనాలకు సంబంధించిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏఓ మురళీధర్‌ను అధికారులు ఆదేశించారు.
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
తిమ్మాజిపేట: చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన తిమ్మాజిపేట మండలం బా వాజీపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు వివరాల మేరకు.. బావాజీపల్లికి చెందిన ఎండీ మహమూద్ (53) కొందరు వ్యక్తులతో కలిసి గ్రామ సమీపంలోని కేఎల్‌ఐ కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. అయితే అతడి మృతిపై మృతుడి సోదరుడు జావీద్ అనుమానాలు వ్యక్తంచేశారు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.


