జడ్చర్ల: పోలేపల్లి సెజ్‌లోని ఫార్మ పరిశ్రమల వ్యర్థాలను విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాలలో పారబోస్తున్నారని ఫలితంగా తీవ్ర కాలుష్యం ఏర్పడుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల కారణంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఊపిరితిత్తులు సమస్యలతో పాటు కేన్సర్ బారిన పడే ప్రమాదముందన్నారు. స్థానికులకు ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వడం లేదని, కాలుష్యాన్ని మాత్రం అంటగడుతున్నారని మండిపడ్డారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ విదేశీ పర్యటన ముగియగానే పోలేపల్లి పరిశ్రమల వ్యర్థాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేవిధంగా కోరుతామన్నారు. తమ పోరాట ఫలితంగా సెజ్‌లో రూ.15 కోట్లతో రసాయన నీటికి సంబంధించి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభమయ్యాయన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
55 మంది ఎమ్మెల్యేల సంతకాలు
తాను అసెంబ్లీలో లేవనెత్తిన ఇప్పపువ్వు సారా ప్రతిపాదనలకు మద్దతుగా 55 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. సీపీఐకి చెందిన ఎమ్మెల్యేతో పాటు బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా సంతకాలు చేశారని అన్నారు. బీఆర్‌ఎస్ వాకౌట్ చేయకుంటే వాళ్లుకూడా సంతకాలు చేసి ఉండేవారని పేర్కొన్నారు. ఆదివాసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
– అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఇంటర్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ జ్యోతి, తహసీల్దార్ నర్సింగరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్‌యాదవ్,తదితరులు పాల్గొన్నారు.


