ఉల్లి రైతు విలవిల | - | Sakshi
Sakshi News home page

ఉల్లి రైతు విలవిల

Apr 14 2026 8:22 AM | Updated on Apr 14 2026 8:22 AM

మార్కెట్‌లో లభించని మద్దతు ధర

ఊరూరా తిరుగుతూ విక్రయాలు

పెట్టుబడి సైతం చేతికందని పరిస్థితి

మరికల్‌: రోజురోజుకు తగ్గుతున్న ధరలతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల కిందట క్వింటా రూ.2 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.700 నుంచి రూ.1,200 మధ్య పలుకుతోంది. కనీసం పెట్టుబడి సైతం లభించని దుస్థితిలో కొందరు రైతులు నేరుగా గ్రామాల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతులకు ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్నాయి. కర్ణాటకలో ధరలు పూర్తిగా తగ్గడంతో అక్కడి రైతులు కూడా పంటను ఇక్కడికి తీసుకొచ్చి విక్రయిస్తుండటంతో ధరలు పడిపోవడానికి కారణమైంది. దీంతో మార్కెట్‌లో మద్దతు ధర లేక ఉల్లి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ధరలు పెరుగుతాయన్న ఆలోచనతో కొందరు రైతులు పొల్లాల్లో చెట్ల నీడన భద్రపరుస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఉల్లి కొనుగోలు చేసే మార్కెట్‌యార్డు లేక అత్యధిక శాతం రైతులు మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మార్కెట్‌యార్డునే నమ్ముకున్నారు. ప్రతి బుధవారం సంతకు రైతులు పెద్దఎత్తున ఉల్లి తరలిస్తుంటారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర, చిన్నచింతకుంట, కోయిల్‌కొండ, నారాయణపేట జిల్లా మరికల్‌, ధన్వాడ, మక్తల్‌ మండలాలతో పాటు కర్ణాటక నుంచి కూడా అత్యధికంగా ఉల్లిని ఇక్కడకు తీసుకొచ్చి విక్రయిస్తారు. గత బుధవారం 384 క్వింటాళ్ల ఉల్లి రాగా కనిష్టంగా రూ.700, గరిష్టంగా రూ.1,200 ధర లభించింది.

Advertisement
 
Advertisement
Advertisement