జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్లు తమ డిమాండ్ల సాధన కోసం 6 రోజులుగా పోరాటం చేస్తున్నా విద్యుత్ యాజమాన్యం మొండివైఖరి వీడటం లేదని ఆర్టిజన్ల జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్ జక్కీ అన్నారు. ఆర్టిజన్ల జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న ధర్నా సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీస్‌రేట్ కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని, విద్యుత్ సంస్థల్లో 2016 డిసెంబర్ కంటే ముందు నుంచి పనిచేస్తూ ఇప్పటికీ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులుగా కొనసాగుతున్న వారిని ఆర్టిజన్‌గా గుర్తించాలని, 2026 పీఆర్సీ అమలు చేయాలని, విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా యాజమాన్యం దిగివచ్చి తమ డిమాండ్లు పరిష్కరించాలని లేనిచో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు సైదులు, మోయిస్, గోపాల్, తిరుమలేష్, శ్రీనివాసులు, శేఖర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


