ఎర్రవల్లి: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఇటిక్యాల మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవిరాథోడ్ కథనం మేరకు.. జోగుళాంబ గద్వాల జిల్లా జింకలపల్లి గ్రామానికి చెందిన దాసరి రామాంజనేయులు (35) ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని ఓ చెట్టుకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి వారు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య దాసరి సంధ్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
పరిశ్రమ వ్యర్థాల
పారబోతపై ఆందోళన
జడ్చర్ల: మండలంలోని కిష్టారం సమీప వాగులో గురువారం రాత్రి పరిశ్రమల ఘన వ్యర్థాల పారబోతపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలేపల్లి సెజ్‌లోని రసాయనిక పరిశ్రమల నుంచి వెలువడిన ఘన వ్యర్థాలను టిప్పర్లలో కిష్టారం సమీప వాగులోకి తరలించి అక్కడ నిప్పంటించి దహనం చేశారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ సుజాత తదితరులు కలిసి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫార్మ పరిశ్రమ వ్యర్థాల పారబోతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదుపరి దహనం చేసిన వ్యర్థాలను పసిగట్టి వాటి ఆధారంగా సంబంధిత పరిశ్రమను గుర్తించి సెజ్‌లోని పరిశ్రమ వద్దకు వెళి ఆందోళన చేపట్టి హెచ్చరించారు. మరోసారి వ్యర్థాలను తమ గ్రామపరిధిలోని వాగులోకి తరలిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని పరిశ్రమ అధికారులకు సూచించారు. అయితే తమ పరిశ్రమకు సంబంధించిన వ్యర్థాలు కావని పరిశ్రమ అధికారులు సర్పంచ్, గ్రామస్తులకు వివరించారు. తాము వ్యర్థాల తరలింపునకు సంబంధించి కాంట్రాక్టర్‌కు అప్పగిస్తామని సదరు కాంట్రాక్టర్ వ్యర్థాలను బయటకు తరలిస్తారని తమకు ఎలాంటి సంబంధం ఉండబోదన్నారు. అనంతరం గ్రామాభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని పరిశ్రమ అధికారులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మనిగింది. ఐదు హైమాస్ట్ లైట్లతోపాటు 15 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతు ప్రాణాలు తీసిన విద్యుదాఘాతం
నర్వ: పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు విద్యు దాఘాతంతో మృతి చెందిన సంఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బెక్కర్‌పల్లి గ్రామానికి చెందిన బించన్ రాములు(45) గురువారం రాత్రి తన సొంత పొలంలో చెరుకు పంటకు నీరు పారించేందుకు వెళ్లారు. బోరు మోటార్ వేసేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడన్నారు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఉదయం కుటుంబసభ్యులు గ్రామస్తులతో కలిసి పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించుకొని ఇంటికి తీసుకొచ్చారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదుచేశారు.
యువతి అదృశ్యంపై కేసు నమోదు
మిడ్జిల్: మండలంలోని వెలుగొమ్ములకు చెందిన ఖాజాబీ(20) అనే యువతి ఈనెల 9న గురువారం ఉదయం ఫోన్ రిపేర్ చేయించుకుంటానని బయటకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాకపోవడంతో తల్లి జహంగీర్ బీ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు. యువతి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
భర్త అదృశ్యంపై భార్య ఫిర్యాదు
మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన బరిగేల ఆంజనేయులు(28) ఈనెల 9 గురువారం నుంచి కల్పించడం లేదని అతని భార్య తేజస్విని శుక్రవారం సాయంత్రం మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు తెలిపారు. భార్య ఫిర్యాదు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


