కురుమూర్తిలో మహా మండపానికి స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

కురుమూర్తిలో మహా మండపానికి స్థల పరిశీలన

Apr 11 2026 9:04 AM | Updated on Apr 11 2026 9:04 AM

చిన్నచింతకుంట: మండలంలోని అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయ మహా మండపం నిర్మాణానికి శుక్రవారం అధికారులు స్థల పరిశీలన చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ కురుమూర్తి స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ మహా మండపానికి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కురుమూర్తి స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందుకు ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతుందన్నారు. అందులో భాగంగానే మహా మండపం నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఈ రణ్వీత్‌, ఆలయ ఈఓ మదనేశ్వరెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

నారాయణపేట: జిల్లాకేంద్రంలోని యాద్గిర్‌ రోడ్డు బైరం కొండ గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున టాస్క్‌ ఫోర్స్‌,నారాయణపేట పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా పీడీఎస్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టుబడింది. టీఎస్‌ 06 యూడీ 0828 వాహనం నుండి 50 బియ్యం సంచులు, సుమారు 25 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ చేపట్టగా ఆ బియ్యం, వాహన యజమాని దామరగిద్ద మండలం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన కొమ్మూర్‌ వెంకటేష్‌కు సంబంధించినదని తేలింది. ఆ వాహనాన్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి డీటీ కాలప్పకు సమాచారం ఇవ్వగా ఆయన పంచనామా చేశారు. బియ్యం కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్కల్‌ తరలిస్తున్నట్లు సమాచారం. వెంకటేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.

రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

భూత్పూర్‌: మండలంలోని ఎల్కిచర్ల వద్ద శుక్రవారం రాత్రి లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు బిజినేపల్లి మండలం వెలుగొండ కు చెందిన జహంగీర్‌ (40) భూత్పూర్‌ నుంచి వెలుగొండకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ఎల్కిచర్ల వద్ద లారీ ఢీకొట్టింది. జహంగీర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement