● నూనె గింజల ఉత్పత్తి పెంచాలి
● కేవీకే సీనియర్ శాస్త్రవేత్త
డా.రాజేందర్‌రెడ్డి
పాన్‌గల్: రైతులు నిరంతరం ఒకే పంటను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా.రాజేందర్‌రెడ్డి, డా.భవాని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో యూత్ ఫర్ యాక్షన్ ఆధ్వర్యంలో ‘సమతుల్య ఎరువుల వినియోగం’ ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు నూనెగింజల ఉత్పత్తులు, పప్పు ధాన్యాల సాగు, పండ్ల తోటల పెంపకం, కూరగాయల పంట సాగుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రసాయనిక ఎరువుల వాడకంతో నేలకు, మానవులకు కలిగే అనర్థాల గురించి వివరించారు. సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలన్నారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను సద్వినియోగం చేసుకుంటూ ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. యుద్ధ ప్రభావంతో యూరియా, డీఏపీ వంటి ఎరువుల తయారీకి ఇబ్బందులు, లభ్యత కూడా తగ్గుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ సమతుల్య ఎరువుల వాడకం పెంచాలన్నారు. చౌడు నేలలలో జీప్సం, జీలుగ వేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. ఉద్యానవన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సాగుతో కలిగే లాభాలను ఉద్యాన వన శాఖ అధికారి కృష్ణయ్య రైతులకు వివరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, ఏడీఏ తిప్పేస్వామి, ఏఓ మణిచందర్, సర్పంచులు నాగలక్ష్మి, పార్వతమ్మ, యూత్ ఫర్ యాక్షన్ ప్రోగ్రాం కోఅర్డినేటర్ వెంకటేష్, ఫీల్డ్ కోఆర్డినేటర్ సూర్యకళ, ప్రోగ్రాం అసోసియేట్ సిల్వి మృదుల, రైతులు పాల్గొన్నారు.


