కొత్తకోట రూరల్: ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఆవిష్కరణల అనువర్తనాలతో భవిష్యత్‌లో వ్యవసాయ, ఉద్యాన అనుబంధ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధ్యమవుతుందని తెలంగాణ నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయభాస్కర్ అన్నారు. పెద్దమందడి మండలంలోని మోజర్ల సమీపంలో గల శ్రీకొండాలక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన కళాశాలలో కుంకుమపువ్వు సాగుపై ఆధునిక పద్ధతుల్లో సమగ్ర పరిశోధనలు చేపట్టేందుకు రూ.32 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఏరోపోనిక్ కుంకుమ పువ్వు ప్రయోగశాలను శుక్రవారం సీజీఎం బి.ఉదయభాస్కర్ ప్రారంభించారు. ఏరోపోనిక్ పద్ధతిలో కృత్రిమ నియంత్రిత వాతావరణంలో కుంకుమపువ్వు సాగు రాష్ట్రంలో ఇప్పటికే ఫలితాలు ఇచ్చిందని, దీంతో భవిష్యత్‌లో పురుగు, తెగులు మందుల అవశేషాలు లేని అత్యంత నాణ్యమైన కుంకుమపువ్వు పొందొచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశారని, అందులో ప్రత్యేకించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడకానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్, సెన్సార్ ఆధారిత సాగు, ఏరోపోనిక్ పద్ధతిలో కుంకుమపువ్వు సాగు వంటి ఆవిష్కరణలు అంకుర పరిశ్రమల స్థాపనకు దోహదం చేస్తాయన్నారు. ఆధునిక సాంకేతిక అంశాలపై పరిశోధన చేపట్టి రైతులకు ఎప్పటికప్పుడు అందజేస్తామని తెలంగా ణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ డి.రాజిరెడ్డి అన్నారు. రైతులు శాసీ్త్రయ టెక్నాలజీ ఆధారిత సాగులో నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కుంకుమపువ్వు ప్రాజెక్టు పరిశోధకులు ప్రొఫెసర్ డాక్టర్ పిడిగెం సైదయ్య, వర్సిటీ డీన్ డాక్టర్ జె.చీనా, ఉద్యాన అధికారి విజయభాస్కర్‌రెడ్డి, అసోసియేట్ డీన్ డాక్టర్ వీణజోషి, డాక్టర్ షహనాజ్, నాబార్డ్ అధికారులు షణ్ముఖచారి, మనోహర్‌రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వచ్చిన ప్రొఫెసర్లు, విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


