● పోటీ లేకుండానే ముగిసిన గొర్రెల వేలం
● రూ.40లక్షల నుంచి రూ.16 లక్షలకు పడిపోయిన వైనం
దేవరకద్ర రూరల్: దేవరకద్ర మున్సిపాలిటీలో శుక్రవారం నిర్వహించిన గొర్రెలు–మేకల వేలం అనుమానాస్పదంగా ముగిసింది. గత సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని ఆధారంగా తీసుకొని అధికారులు ఈసారి ప్రభుత్వ ధరను రూ.16,90,000గా నిర్ణయించారు. అయితే వేలంలో కటికే రామోజీ రూ.16,97,000కే దక్కించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
పునర్వేలంలో తగ్గిన పోటీ
గతనెల 23న నిర్వహించిన వేలంలో రూ. 40,01,000కు బిడ్ చేశారు. రెండో పోటీదారుడు కూడా రూ.40 లక్షల వరకు బిడ్ చేసినప్పటికీ, నిర్వహణకు ముందుకు రాకపోవడంతో అధికారులు మొదటి బిడ్డర్ డీడీని జప్తు చేసి, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పునర్వేలాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పునర్వేలంలో కూడా ధరలు దాదాపు అదేస్థాయిలో ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. అయితే వాస్తవానికి అప్సెట్ ప్రైస్‌ను కేవలం రూ.7వేలు మాత్రమే అధిగమించడం అనుమానాలకు తావిస్తోంది. రూ.2,50,000తో 25మంది బిడ్డర్లు వేలంలో పాల్గొన్నప్పటికీ పోటీ లేకపోవడం రింగ్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోటీకి రాకుండా ఒక్కో డీడీకి రూ.35 వేల వరకు చెల్లింపులకు ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై అధికారుల విచారణకు దిగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.


