కేఎల్‌ఐ కాల్వలో మొసలి సంచారం | - | Sakshi
Sakshi News home page

కేఎల్‌ఐ కాల్వలో మొసలి సంచారం

Apr 10 2026 10:57 AM | Updated on Apr 10 2026 10:57 AM

బిజినేపల్లి: మండల కేంద్రం నుంచి వనపర్తికి వెళ్లే ప్రధాన రోడ్డులో బుధవారం రాత్రి ప్రయాణికులకు శాయిన్‌పల్లి కేఎల్‌ఐ వంతెన సమీపంలో మొసలి కనిపించింది. కేఎల్‌ఐ బ్రిడ్జి సమీపంలో రోడ్డు దాటుతుండగా.. వాహనాల శబ్దానికి తిరిగి నీటిలోకి వెళ్లింది. మొసలి రోడ్డు పైకి వచ్చినప్పుడు కొందరు యువకులు వీడియో తీసే ప్రయత్నం చేశారు. రాత్రిళ్లు ఆహారం కోసం మొసలి కేఎల్‌ఐ కాల్వ నుంచి బయటికి వచ్చి ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే శాయిన్‌పల్లి, మమ్మాయిపల్లి గ్రామాల ప్రజలు, కేఎల్‌ఐ సమీప పొలాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బిజినేపల్లి పరిసరాల్లో మొదటిసారి మొసలి కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆముదం పంట సాగుతో అధిక దిగుబడులు

తిమ్మాజిపేట: ఆముదం పంట ఆధునిక వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని రాజేంద్రనగర్‌ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనసంస్థ సహాయ సంచాలకులు డాక్టర్‌ శశిభూషణ్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం మరికల్‌ సమీపంలో రైతు శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో గురువారం రైతులకు శాస్త్రవేత్తల బృందం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా సహాయ సంచాలకులు శశిభూషణ్‌ మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో యాసంగి పంటగ ఆముదం పంటను ప్రోత్సహించాలనేది ప్రధాన ఉద్దేశమన్నారు. ఆముదం పంట సాగులో పాటించాల్సిన పద్ధతులను ప్రథమ శ్రేణి ప్రదర్శనల ద్వారా రైతులకు వివరించనున్నట్లు తెలిపారు. ఆముదం పంట విస్తీర్ణం పెంచడానికి డ్రిప్‌ సహాయంతో, అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవచ్చన్నారు. పంటల మార్పిడి చేపట్టడం ద్వారా నేల ఆరోగ్యాన్ని పరిరక్షించ వచ్చన్నారు. డాక్టర్‌ మమత ఆముదం పంటలో యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి ఎలా సాధించ వచ్చనే విషయాన్నీ రైతులకు అవగాహన కల్పించారు. మన ప్రాంతంలోని వ్యవసాయ భూములలో హైబ్రిడ్‌, మేలు రకపు విత్తనాలను డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ మాధురి,ఏఓ కమల్‌కుమార్‌, సర్పంచ్‌ రమాదేవి, పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శి శాశ్వత తొలగింపు

అవినీతి ఆరోపణలు రుజువు

కావడంతో చర్యలు

అయిజ: జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని ఎక్లాస్‌పురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో పనిచేసిన బోయ రంగన్నను గురువారం కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు ఎంపీడీఓ భాస్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 13న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడితో బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్‌ చేయడంతో ఏసీబీకి పట్టుబడ్డాడని, పంచాయతీ కార్యదర్శి రంగన్నపై ఆరోపణలు రుజువు కావడంతో శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీచేసినట్లు ఎంపీడీఓ వెల్లడించారు.

శాయిన్‌పల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద రోడ్డు దాటేందుకు యత్నం

Advertisement
 
Advertisement
Advertisement