పాత నేరస్తుడే హంతకుడు..! | - | Sakshi
Sakshi News home page

పాత నేరస్తుడే హంతకుడు..!

Apr 7 2026 8:07 AM | Updated on Apr 7 2026 8:07 AM

నారాయణపేట రూరల్‌: ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి, హతమార్చిన కామాంధుడు కటకటాలపాలయ్యాడు. వారం రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక కేసును పోలీసులు చేధించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ డా.వినీత్‌ వెల్లడించారు. నారాయణపేట మండలంలోని బసిరెడ్డిపల్లికి చెందిన శిరీష, ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటుండగా.. వారి కుమార్తె తేజశ్రీ (5) గ్రామంలోనే నాయనమ్మ, తాతతో కలిసి నివాసం ఉంటుంది. గతనెల 31న రాత్రి భోజనం అనంతరం చిన్నారితో కలిసి అవ్వ, తాత ఆరుబయట నిద్రించగా.. అదే గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులు మద్యం తాగి అటువైపు వచ్చాడు. నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చి, సమీపంలోని చెరువు కట్టపై పాడేశాడు. ఈ క్రమంలో కాళ్లకు ఉన్న పట్టీలను తీసుకుని.. ఇది దొంగల పనిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అదే రోజు రాత్రి పొలం పనులు పూర్తిచేసుకుని అటుగా వస్తున్న రైతులు చంద్రప్ప, కేశవులు అచేతన స్థితిలో ఉన్న చిన్నారిని గమనించి.. గ్రామస్తులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన డీఎస్పీ లింగయ్య, సీఐ శివకుమార్‌, ఎస్‌ఐ గాయత్రి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ వినీత్‌.. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విచారణను వేగవంతం చేశారు. చిన్నారి మృతదేహానికి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. రిపోర్టు ఆధారంగా లైంగిక దాడి జరిగినట్టు గుర్తించారు. ఈ క్రమంలో విచారణ బృందాలు పాత నేరస్తుల జాబితాను పరిశీలించి.. గ్రామానికి చెందిన బక్క చిన్న నర్సింహులును అదుపులోకి తీసుకొని విచారించారు. అతడు చేసిన తప్పును ఒప్పుకొని జరిగిందంతా పోలీసులకు వివరించారు. అతడి నుంచి కాళ్ల పట్టీలను రికవరీ చేశారు. 48 గంటల్లో నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించడంలో కృషిచేసిన పోలీస్‌ అధికారులను ఎస్పీ అభినందించారు. కాగా, నిందితుడు నర్సింహులుకు రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు భార్యలు సైతం ఆయనతో కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్లారు. అతడు 2014లో ఓ అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడటంతో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు.. మార్చి 31న అర్ధరాత్రి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీలు లింగయ్య, మహేశ్‌, సీఐ శివకుమార్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, గాయత్రి, సతీశ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి చేసి హతమార్చిన కామాంధుడు

48 గంటల్లోనే నిందితుడినిపట్టుకున్న పోలీసులు

చిన్నారి కాళ్ల పట్టీలు స్వాధీనం

వివరాలు వెల్లడించిన నారాయణపేట ఎస్పీ డా.వినీత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement