మహబూబ్‌నగర్ (వ్యవసాయం): రైతులు, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదకర రసాయన పురుగు మందుగా గుర్తించిన పారాక్వాట్, ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ప్రభావంతో 60 రోజుల పాటు పూర్తి నిషేధం విధించింది.
అన్ని దశల్లో నిషేధం
అమ్మకం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగం వంటి అన్ని దశల్లో పారాక్వాట్‌పై ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. ఇన్సక్టిసిడ్స్ యాక్ట్– 1968 ప్రకారం అధికారాలను వినియోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కట్టుదిట్టంగా అమలు
వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నారు. ఇన్‌పుట్ డీలర్లు, పురుగు మందుల దుకాణాలపై ప్రత్యే క తనిఖీలు నిర్వహించనున్నారు. ఎక్కడైనా ఉల్లంఘనలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
రైతులకు అవగాహన
ప్రతి గ్రామంలో రైతులకు పారాక్వాట్ ప్రమాదాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రైతులు ఈ రసాయన వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, భద్రమైన ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు.
హానికర రసాయనం
పారాక్వాట్ మనుషుల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. శ్వాసకోశ సమస్యలు, ఊపిరితిత్తుల దెబ్బతినడం, లంగ్ ఫైబ్రోసిస్ వంటి ప్రమాదాలు ఉన్నట్లు వైద్య నివేదికలు సూచిస్తున్నాయి. అదే విధంగా కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు విష ప్రభావం వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది.
పర్యావరణానికి ముప్పు
పారాక్వాట్ కారణంగా పశువులు, పక్షులు విష ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. నేల నాణ్యత తగ్గిపోవడం, నీటి కాలుష్యం పెరగడం, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి ప్రతికూల ప్రభావాలు కూడా కనిపిస్తున్నాయి.
రైతుల ఆరోగ్యం, పర్యావరణ రక్షణే లక్ష్యం


