కొల్లాపూర్ రూరల్: మండలంలోని కృష్ణా నది అందాలను వీక్షించేందుకు వచ్చే విహారయాత్రికులు బోటులో ప్రయాణించాలంటే తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలని లేని పక్షంలో వారిని బోటులో అనుమతించొద్దని జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ్మ టూరిస్టు పోలీసులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని సోమశిల నుంచి కృష్ణానదిలో బోటులో సంగమేశ్వరాలయం వెళ్లే పర్యాటకులను స్థానిక సర్పంచ్ వెంకటలక్ష్మితో కలిసి పరిశీలించారు. కొందరు లైఫ్ జాకెట్లు లేకుండా ప్రయాణించడాన్ని గమనించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటకులు బోటులో వెళ్లేటప్పుడు తప్పకుండా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. మర బోట్ల యాజమానులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సోమశిల నుంచి ఏపీలో నది అవతలివైపు ఉన్న సంగమేశ్వరాలయానికి పర్యాటకుల రద్దీ పెరుగుతుందని అందులో భాగంగా నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గోన్నారు.


