జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలోని పెండింగ్‌లో ఉన్న ప్రతి ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేయాలని తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం తన నివాసంలో ఉమ్మడి జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సత్వర పూర్తి కోసం సమాలోచన, కార్యాచరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలుత అన్ని నీటి ప్రాజెక్టులను రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాస్వామిక వాదులతో కలిసి పర్యటన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఎక్కడికి అక్కడ ఆయా ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజలతో మాట్లాడాలని స్థానిక ప్రజా ప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కూడా జిల్లా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే మహబూబ్‌నగర్ జిల్లా శాశ్వత వెనుకబాటు తనంలో మిగిలిపోతుంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తమ సమావేశాలలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈనెలలోనే ప్రాజెక్టుల సందర్శన చేపడతామని తెలిపారు. జిల్లా ప్రయోజనం కోసం చేపట్టిన కార్యక్రమాలుగా గుర్తించి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఎం.రాఘవాచారి, న్యాయవాదులు వీరబ్రహ్మచారి, బి.జనార్దన్, పరమేశ్వర్, మధుసూదన్‌బాబు, రిటైర్డ్ తహసీల్దార్ చెన్నకిష్టన్న, నాయకులు టీజీ శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
జడ్చర్ల: ప్రజా సమస్యలపై నిరంతర పోరాటా లు కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం జడ్చర్లలోని 8వ వార్డులో ఇంటింటికి సీపీఐ కార్యక్రమాలను తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సీపీఐ కార్యక్రమాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి పోరాటా లు కొనసాగిస్తామన్నారు. సీపీఐకి విరాళాలు అందజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు బాగి కృష్ణయ్య, ఖలీం, మహేశ్, రహమతుల్లా, తదితరులు పాల్గొన్నారు.


