● మహబూబ్‌నగర్‌ను
అన్ని విధాలుగా తీర్చిదిద్దుతాం
● ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
స్టేషన్ మహబూబ్‌నగర్: విజన్ 2047 లక్ష్యంగా మహబూబ్‌నగర్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల మూడు నెలల కాలంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆశీస్సులతో మహబూబ్‌నగర్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేసినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ఒక సమగ్ర ప్రణాళికబద్ధమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ, జూనియర్ కళాశాలలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, ఏటీసీ, ట్రిపుల్ ఐటీ, ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ఎన్నో విద్యాసంస్థలు పట్టణానికి తెస్తున్నామన్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ నగరంలో 3.30లక్షల జనాభా ఉందని, 2047 వరకు సుమారు 5లక్షల జనాభా పెరిగే అవకాశం ఉందని, దానిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం నగరానికి రోజుకు దాదాపు 40 ఎంఎల్‌డీ నీటి అవసరం ఉండగా, 20 నుంచి 30 ఎంఎల్‌డీ మాత్రమే అందుబాటులో ఉందని, లీకేజీలు, పంపింగ్ సమస్యలు కూడా నీటి సరఫరాను ప్రభావితం చేస్తున్నాయన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు రూ.220 కోట్లతో వాటర్ ఆగ్మేంటేషన్ స్కీమ్ చేపట్టినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పట్టణంలో 14 రిజర్వాయర్ల నిర్మాణం 18.6 మిలియన్ లీటర్ల అదనపు నీటి నిల్వ సామర్థ్య, 40 కిలోమీటర్ల ఫీడర్ పైప్‌లైన్లు, 209 కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, భవిష్యత్‌లో 60ఎంఎల్‌డీ నీటి సరఫరా అందేవిధంగా ఈ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డి, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.


