కమిషన్‌ పేరుతో ప్రభుత్వం కుట్ర | - | Sakshi
Sakshi News home page

కమిషన్‌ పేరుతో ప్రభుత్వం కుట్ర

Mar 30 2026 1:02 PM | Updated on Mar 30 2026 1:02 PM

ప్రపంచ శాంతికి భారత్‌ కృషి చేయాలి

అలంపూర్‌: కమిషన్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేయడానికి కుట్ర చేస్తోందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, స్కూల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి చావా రవి ఆరోపించారు. అలంపూర్‌ పట్టణంలో రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా సదస్సుకు హాజరైన ముఖ్య నాయకులు, ఉపాధ్యాయులు అలంపూర్‌ పురవీధుల్లో ప్రపంచ శాంతిని ఆకాంక్షిస్తూ ర్యాలీ చేపట్టారు. యుద్ధం నివారించి మానవ హక్కులను కాపాడాలని నినదించారు. ఈ సందర్భంగా చావా రవి మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా రాష్ట్రంలో విద్యా రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. ఆహ్లాదకర వాతావరణం కోసం మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం విద్యకు సరైన బడ్జెట్‌ కేటాయించడం లేదన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా విద్యా కమిషన్‌ పేరుతో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. పరోక్షంగా ప్రైవేటు విద్యను బలోపేతం చేస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, డీఏలు ఇవ్వకుండా పీఆర్సీ కమిషన్‌ రిపోర్ట్‌ను కావాలని తొక్కిపెట్టడం తగదన్నారు. నూతన సంస్కరణల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ పాఠశాలల ప్రభుత్వ నిర్ణయం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీవీబీ వంటి పాఠశాలల మూతపడే అవకాశం ఉంటుందన్నారు. మండలాన్ని రెండు లేదా మూడు క్లస్టర్‌గా విభజిస్తూ పబ్లిక్‌ పాఠశాలల ఏర్పాటుతో గ్రామాల నుంచి విద్యార్థులను తరలించడానికి రవాణ ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉంటుందన్నారు. పూర్వ ప్రాథమిక తరగతుల నిర్ణయాన్ని స్వాగతిస్తూనే పూర్వ ప్రాథమిక విద్య కోసం నూతన ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని తొలగించి రెగ్యులరైజేషన్‌ చేస్తామంటూనే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆక్షేపనీయమన్నారు. సర్వశిక్ష అభియాన్‌లో భాగంగా పనిచేస్తున్న సీఆర్పీలను, ఎంఐఎస్‌ కోఆర్డినేట్లకు రెగ్యులర్‌ వేతనాన్ని ఇవ్వాలన్నారు. కేజీబీవీలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలని వారికి 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర విద్యా సదస్సు

ప్రస్తుత యుద్ధ వాతవరణ పరిస్థితుల్లో భారత్‌ ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌ అన్నారు. విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్‌ సామ్రాజ్యవాద ధోరణితో ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. అమెరికా ఆధిపత్య ధోరణి ఇరాన్‌ దేశంలో తీవ్రంగా మానవ హక్కులు హరించబడినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రమేష్‌, ఫ్యామిటీ వెల్ఫేర్‌ ఫండ్‌ జిల్లా కన్వీనర్‌ బీసన్న, యూటీఎఫ్‌ జిల్లా నాయకులు గోపాల్‌, రవిప్రకాష్‌గౌడ్‌, కుమార్‌నాయుడు, వెంకటరమణ, రాజశేఖర్‌, తిమ్మప్ప, తిలక్‌, చంద్రకాంత్‌, లక్ష్మన్న, రాముడు, చిరంజీవినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement