ప్రేమ పేరుతో మోసం.. యువకుడికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో మోసం.. యువకుడికి రిమాండ్‌

Mar 30 2026 1:02 PM | Updated on Mar 30 2026 1:02 PM

పాన్‌గల్‌: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ కుర్మయ్య ఆదివారం తెలిపారు. మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని రేమద్దుల గ్రామానికి చెందిన మీదిండ్ల నవీన్‌ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని లోబర్చుకున్నాడు. తర్వాత పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ముఖం చాటేశాడు. దీంతో సదరు యువకుడిపై యువతి ఈనెల 24న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అనంతరం శనివారం రాత్రి యువకుడిని అరెస్టు చేసి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆదేశానుసారం యువకుడిని మహబూబ్‌నగర్‌ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.

కారు ఢీ.. వ్యక్తి దుర్మరణం

మిడ్జిల్‌: రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల పరిధిలొని బోయిన్‌పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు కథనం మేరకు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం బాల్యలోక్య తండాకు చెందిన దేవ్యా (40) పనిమీద బోయిన్‌పల్లి గ్రామానికి వచ్చారు. పని ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కల్వకుర్తి నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో దేవ్యా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య సిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

నీటి బకెట్‌లో పడి

చిన్నారి మృతి

ఽభూత్పూర్‌: రెండేళ్ల చిన్నా రి నీటి బకెట్‌లో పడి మర ణించిన ఘటన పట్టణంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన మహమూద్‌, అస్మల కుమార్తె జూవేరియా ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న నీటి సంపులో పడిపోయింది. తల్లిదండ్రులు గమనించి వెంటనే బయటికి తీసి ద్విచక్రవాహనంపై జిల్లా ఆస్పతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ విషయమై ఎస్‌ఐ చంద్రశేఖర్‌ను సంప్రదించగా చిన్నారి మృతిపై తమకు ఏలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

దైవక్షేత్రంలో వరుసగా కోడెదూడల మృతి

దేవరకద్ర రూరల్‌: ఉమ్మడి జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన చిన్నరాజమూర్‌ గ్రామంలోని చిన్నరాజమూర్‌ ఆంజనేయస్వామి దేవాలయంలో వరుసగా కోడెదూడలు మృతి చెందడం కలకలం రేపుతుంది. భక్తులు మొక్కులు తీర్చుకునే క్రమంలో ఆలయానికి సమర్పించిన ఆవులు, కోడెదూడల బాగోగులు పట్టించకోకపోవడంతో ఇప్పటి వరకు పదికి పైగా కోడెదూడలు మరణించాయి. ఆదివారం కూడా ఓ కోడెదూడ మరణించగా అధికారులు కళేబరాన్ని బయటికి పొక్కకుండా తరలించారు. రూ.లక్షల్లో ఆదాయం వచ్చే ఆలయంలో పశువులకు కనీసం పశుగ్రాసం, తాగునీరు కూడ అందకపోవడంతోనే మరణించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement