గద్వాల క్రైం: ఉద్యోగం పేరుతో యువకులను మోసం చేసిన ఘటనపై ఆదివారం పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు పట్టణ రెండో ఎస్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఐడీఎస్‌ఎంటీ కాలనీకి చెందిన గుణవర్ధన్‌రెడ్డి ఇటీవల ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో తెలిసిన వ్యక్తులు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 2 లక్షలు వసూలు చేశారు. తెలిసిన వ్యక్తులే కదా అని నమ్మి తనతో పాటు మరి కొంత మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని డబ్బులు అందజేసినట్లు బాధితులు తెలిపారు. అయితే సదరు వ్యక్తులు కంపెనీలో ఉద్యోగం వచ్చినట్లు నకిలీ ప్రవేశపత్రం అందజేశారు. వాటిని తీసుకుని కంపెనీకి వెళ్లాగా అక్కడి సిబ్బంది నకిలీ ఉద్యోగ నియామక పత్రాలుగా నిర్వహకులు చెప్పడంతో మోసపోయినట్లు గుర్తించి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
‘పల్లెనిద్ర’లో
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
ధరూరు: భీం దీక్షలో భాగంగా స్వేరోస్ ఫౌండర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండల పరిధిలోని మార్లబీడు గ్రామం చేరుకున్నారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజలతో మమేకమయ్యేందుకు చేపట్టిన పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చదువకోవాలని, జ్ఞానంతోనే అన్నింటిని జయించవచ్చన్నారు. మహనీయుల చరిత్రను వివరించారు. స్వేరోతో ఎంతో మంది చిన్నారుల జీవితాలను మార్చాలన్నదే తమ లక్ష్యమన్నారు. అంతకు ముందు ధరూరులోని స్వేరో నాయకులు శ్రీనివాస్ మహరాజ్ ఇంటికి చేరుకుని తేనీటి విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కర్రెన్న, జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు వెంకటన్న, దేవన్న, గోవిందు, లాజర్, సత్యం, శ్రీనివాసులు, అశోక్, స్వేరో జిల్లా ఉపాధ్యక్షులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
దేశభక్తికి మారు పేరు శివాజీ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యం, దేశభక్తికి మారుపేరని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం స్థానిక బోయపల్లిలో వాయుపుత్ర యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ స్వాభిమానానికి ఆరాధ్యుడన్నారు. యువత మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి బానిస కాకుండా, శారీరకంగా దృఢంగా, మానసికంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు.


