స్టేషన్ మహబూబ్‌నగర్: శ్రీకరి ఫౌండేషన్ పాలమూరు ఆధ్వర్యంలో ఆదివారం మర్లులోని శ్రీశాంతినగర్ కాలనీలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హిందూ ధర్మ రక్ష ఫౌండర్ చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని వేధిస్తున్న డ్రగ్స్, మత్తు పదార్థాల నుంచి యువతను రక్షించాలని వాటికి బానిసలు కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. మత్తు వల్ల కలిగే అనర్థాలు వారికి వివరించాలని స్కూల్ దశ నుంచే వాటిపై అవగాహన కల్పించాలన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు యువత నడుం బిగించాలన్నారు. శ్రీకరి ఫౌండేషన్ సేవలను ఆయన కొనియాడారు. అనంతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, కాటికాపరులు, మున్సిపల్ సిబ్బంది, రంగస్థల నటులకు, ప్రవచనకర్తలకు, పోలీస్ ఉద్యోగులకు ఇలా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న దాదాపు 70 మందికి ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాని శ్రీనివాస్, ఫౌండేషన్ ప్రతినిధి మెట్టుకాడి శ్యాంసుందర్, కృష్ణవర్మ, భానుప్రకాశ్, మెట్టుకాడి ప్రణీత, సిద్దిరామప్ప, మెట్టుకాడి ప్రభాకర్, లక్ష్మణ్‌సింగ్, కార్పొరేటర్ లక్ష్మినరేష్ తదితరులు పాల్గొన్నారు.


