ఉండవెల్లి: దేశంలో హిందూ సమాజం అంతరించకుండా అదుపు చేయాలంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు హిందుత్వంపై పట్టు, ఐక్యత ఉండాలని పురాణపీఠం, అనంత సాహితి ఆశ్రమానికి చెందిన అనంతానంద భారతి స్వామిజీ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంతానంద భారతి స్వామిజీ మాట్లాడుతూ.. ప్రజల్లో హిందు సంస్కృతి, సమాజం అంతంకాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే చిన్నారులకు హిందుత్వంపై అవగాహన కల్పించాలని, రాష్ట్రంలో హిందూ సమాజంపై పట్టు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. నుదుటిన బొట్టు, సాంప్రదాయ దుస్తులను ధరించి కులమతాలకు అతీతంగా హిందూమతంపై ప్రచారం కొనసాగించాలి. దేశంలో హిందుత్వంపై ఐక్యత రావాలంటే మొదట పల్లె నుంచే ప్రారంభించాలని ప్రజలకు ఉపసందేశం అందించారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ ప్రధాన వక్త మాట్లాడుతూ ప్రతి గ్రామంలో హిందువులందరూ ఒక్క మాటపై ఉంటే ఎవరొచ్చినా ఏమి చేయలేరన్నారు. దేశంపై గౌరవం ఉన్న వాడికి హిందుత్వంపై మక్కువ ఉంటుంది. రాష్ట్రీయ స్వంయం సేవక్ సంఘ్ 1952లో ప్రారంభిచి వందేళ్ల ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలను చూసిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో హిందు సమ్మేళనం కమిటీ అధ్యక్షుడు చల్లా దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


