మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖ నుంచి మొత్తం 3,416 కేసులు పరిష్కారం అయినట్లు ఎస్పీ డి.జానకి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ బాధితులకు రూ.42,97,445 నగదు తిరిగి అందజేసినట్లు పేర్కొన్నారు. ఐపీసీ కేసులు 524, డ్రంకన్‌డ్రైవ్ 794, ఈ–పెట్టీ కేసులు 1,979, సైబర్ క్రైం కేసులు 119 పరిష్కరించినట్లు వివరించారు. ఈ కేసుల రాజీతో బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు కోర్టులపై ఉన్న భారం కూడా తగ్గినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలను వేగవంతంగా పరిష్కరించుకోవడం వల్ల ఆర్థికంగా ఆదా కావడంతో పాటు సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు.
ఉత్సాహంగా ‘హ్యాపీ డే’
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఎన్‌హెచ్–167పై జిల్లా స్టేడియం కమాన్ వద్ద మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మూడు గంటల పాటు ‘హ్యాపీ డే’ నిర్వహించారు. చిన్నారుల నృత్య, కరాటే ప్రదర్శనలు, మ్యాజిక్‌షో, యోగాసనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే ఎస్‌హెచ్‌జీలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో వారు తయారుచేసిన పౌష్టికాహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను ప్రదర్శించగా ప్రజలు ఆసక్తిగా వీక్షించి కొనుగోలు చేశారు.


