మహబూబ్‌నగర్ క్రైం: రంజాన్ సందర్భంగా శనివారం నగరంలోని ఈద్గా దగ్గర బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.జానకి పర్యవేక్షించారు. ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి వచ్చే మైనార్టీలకు ఎలాంటి సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. ప్రధానంగా వాహనాల పార్కింగ్ దగ్గర, రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఈద్గాల దగ్గర ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లావ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. పండగ సందర్భంగా నిరంతరం పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్‌బీ రత్నం, సురేష్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు అప్పయ్య, శ్రీనివాస్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
అన్ని వర్గాలను నిరాశపరిచిన బడ్జెట్
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో కాంగ్రెస్ సర్కారు అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేసిందని మరోసారి తేలిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. శనివారం ఆయన విలేకరలుతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మూడో బడ్జెట్‌లోనైనా ప్రభుత్వం సంక్షేమం పథకాలపై ఎక్కువ దృష్టి పెడుతుందనుకున్నారని.. కానీ అందుకు భిన్నంగా ఉందన్నారు. ఈ బడ్జెట్‌లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్‌లకు ఊసే లేదన్నారు. బీసీలకు ఏడాదికి రూ.20వేల కోట్లు ఐదేళ్లకు లక్ష కోట్లు ఇస్తామని ఇప్పుడు 3.85 శాతం నిధులు మాత్రమే కేటాయించారని విమర్శించారు. బీసీ గురుకులాల్లో అన్నం సరిగ్గా లేక విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారని, మైనారిటీ గురుకులాల్లో వసతులు లేక ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని ప్రభుత్వం మాట తప్పిందని, పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు సరిగా ఇవ్వడం లేదని ఆరోపించారు. పదవీ విరమణ పొందిన వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. అన్నం పెట్టే రైతు ఇబ్బందుల్లో ఉన్నాడని, రైతుబంధు, విద్యుత్ సరఫరా, యూరియా సరిగా ఇవ్వడం లేదని, పండించిన తరువాత కనీసం గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు. జనాభాలో సగ భాగం ఉన్న బీసీలకు రూ.50 వేల కోట్లు ఇవ్వాల్సిందేని, దళితులకు రూ.10 లక్షలు ఇచ్చేందుకు బడ్జెట్ పెట్టాలని డిమాండ్ చేశారు. మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేయాలని కోరారు. సమావేశంలో మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్ కార్పొరేటర్లు కిషోర్, సిద్దిఖి, శరత్, మధు, నవకాంత్, నాయకులు నరేందర్, అన్వర్, నరేష్, శ్రీశైలం పాల్గొన్నారు.
బకాయిలు చెల్లించేదెన్నడో?
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు మొండిచేయి చూపించడం తగదని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం అధ్యక్షుడు ఎ.రాజసింహుడు అన్నారు. శనివారం మెట్టుగడ్డలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. బకాయిలు రాక, పింఛను లేక ఎలా బతకాలని ప్రశ్నించారు. 2024 జూలై నుంచి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల లీవ్ ఎన్‌కాష్‌మెంట్, గ్రాట్యుటీ ఇంతవరకు చెల్లించలేదన్నారు. 2017 పేస్కేల్, డిఫరెన్స్ ఎరియర్స్, డీఏ బకాయిలు చెల్లించడానికి ఆర్టీసీకి నిధులు కేటాయించకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు. సమావేశంలో ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోరం నాయకులు డి.భగవంతు, బీహెచ్ కుమార్, అంజన్న, మోహన్‌రెడ్డి, ఉమేష్‌కుమార్, రాంరెడ్డి, మనోహర్, ఇజ్రాయెల్, చక్రధర్ పాల్గొన్నారు.


