కరివేపాకు సాగుతో లాభాలు | - | Sakshi
Sakshi News home page

కరివేపాకు సాగుతో లాభాలు

Mar 17 2026 8:35 AM | Updated on Mar 17 2026 8:35 AM

అలంపూర్‌: కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అందుకే కొందరు కూరల్లో వేసుకోని తింటే మరి కొందరు పౌడర్‌ రూపంలో తీసుకోని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కరివేపాగు సాగు చేయడం ఎంతో సులభమని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్‌ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరివేపాకు సాగు పలు సూచనలు అందిస్తున్నారు. జిల్లా వాతావరణానికి కరివేపాకు సాగు అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఎర్రనేలలో పంట సాగు చేయడంతో అధిక దిగుబడి, సులభంగా సాగు చేసుకోనే అవకాశం ఉందని దీంతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.

కరివేపాకు సాగులో మెళకువలు..

పంట రకాలు.. సెంకంపు: ఈ రకాన్ని తమిళ నాడులో అధికంగా సాగు చేస్తారు. ఆకు ఎక్కువగా ఉండి నూనె శాతం, వాసన కలిగి ఉంటాయి.

డీడబ్ల్యూడీ–1 : ఈ రకం వేరు పిలకల ద్వారా ఎన్నుకోబడింది. ఆకు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చలిని తట్టుకోలేదు. ఆకులను పొడిగా చేసుకోని వాడుకోవచ్చు.

డీడబ్ల్యూ డీ–2: విత్తనాల ద్వారా వేసిన పంట రకం నుంచి ఎన్నుకోబడిన రకం ఇది. ఆకు లేత పసుపు రంగులో ఉండి వాసన తక్కువగా ఉంటుంది. ఈ రకం చలిని తట్టుకుంటుంది. దీని పెరుగుదల అధికంగా ఉంటుంది.

సువాసిని: వేరు మొక్కల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. మెట్ట ప్రాంతాలకు ఇది అనుకూలం.

భువనేశ్వర: నీటి వసతి ప్రాంతాల్లో ఎక్కువగా సాగు అవు తుంది. అన్ని రకాల నేలల్లో పండిస్తారు. మురుగు నీటి పారుదల సౌకర్యం ఉన్న ఎర్ర నేలలు శ్రేష్టం. ఎర్రతువ్వ నేలల్లో పెరుగుదల బాగా ఉంటుంది. ఆకు దిగుబడి ఎక్కువగా ఉంటుంది. మురుగు నీటి పారుదల లేని నల్ల నేలలు పనికి రావు.

విత్తుట..

కరివేపాకును విత్తనాల ద్వారా పెంచవచ్చు. విత్తనా లతో నారు మొక్కలను పెంచి ప్రధాన పొలాల్లో నా టాలి. నారు పెంచేందుకు బాగా పండించిన మంచి పండ్లను, బాగా పెరుగుదల కలిగిన తల్లి చెట్ల నుంచి కోయాలి. జూలై, ఆగస్టు నెలల్లో పండ్లు కాస్తా యి. ఆగస్టు నెలలో పండ్లను సేకరించిన 3–4 రోజు ల్లో విత్తనాలను తీసి నారుమళ్లు, పాలిథిన్‌ సంచుల్లో విత్తాలి. ప్రతి పండులో 3– 4 విత్తనాలు ఉంటాయి.

విత్తన మోతాదు..

ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనాలు లేదా 25 కిలోల పండ్లు సరిపోతాయి.

విత్తే పద్ధతి..

మీటర్‌ విస్తీర్ణంలో 30 సెం.మీ. ఎత్తు కలిగిన నారుమళ్లను తయారు చేయాలి. నారుమళ్లకు తగినంత పశువుల ఎరువులు వేసిన తరువాత 10 సె.మీ. దూరంలో గీసి విత్తనాలను విత్తుకోవాలి. మూడు రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి.

నేల తయారీ మొక్కలు నాటుట..

ప్రధాన భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువులు వేయాలి. 30.30.30 సె.మీ. పరిమాణం గల గుంతలను 1.2 నుంచి 1.5 మీ దూరంలో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడానికి రెండు నెలల ముందు గుంతలు తీయాలి. ఈ గుంతలను పశువుల ఎరువును కలిపి నింపాలి. గుంత మధ్యలో ఒక్కో నారుమొక్క నాటాలి.

ఎరువులు..

ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేయాలి. ఎకరాకు 28 కేజీల నత్రజని, 9 కిలో భాస్వరం, 8 కిలో పొటాష్‌ని ఇచ్చే ఎరువులను కలిపి గుంతలో సమానంగా నింపాలి. నీటి యాజమాన్యం, మొక్కలను నాటిన వెంటనే గుంతలను తడపాలి. నాటిన మూడో రోజు మరొక తడి అందించాలి. తర్వాత వారానికి ఒక తడి అందిస్తూ ఉండాలి. గుంతలను కలుపుతూ కాల్వలను ఏర్పాటు చేసి నీటిని అందించాల్సి ఉంటుంది.

అంతర కృషి..

గుంతల మధ్య ఎలాంటి కలుపు లేకుండా చూడాలి. మొదటి సంవత్సరం గుంతల మధ్య అపరాలు పండించవచ్చు.

సస్యరక్షణ చర్యలు

గొంగళి పురుగు: గొంగళి పురుగు చిన్నప్పుడు తెల్లని చా రలతో నలుపు రంగులో ఉంటుంది. తరువాత ముదురు ఆకుపచ్చ రంగులో లావుగా స్థూపాకారంలో ఉంటుంది. పురుగులను చేతితో తీసి నాశనం చేయడం శ్రేయస్కరం, వేప సంబంధిత క్రిమి సంహార మందులు ఉపయోగించాలి. తప్పని పరిస్థితుల్లో నువాన్‌ 1 మి.లీ. లేదా 2 మి.లీ. క్వినాల్‌పాస్‌ లీటర్‌ నీటితో కలిపి పిచికారీ చేయాలి.

తెగుళ్లు : ఆకుపచ్చ తెగుళ్ల సోకే ఆవకాశం ఉంది. దీని నివారణకు గ్రామ కార్బాండిజమ్‌ లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. గంధం కలిగిన క్రిమి నాశకాలను వాడితే ఆకు రాలిపోతుంది. కాబట్టి మందును వాడరాదు.

కోత దిగుబడి

మొదటి సంవత్సరం ఎకరాకు 100 నుంచి 160 కిలోల దిగుబడి వస్తుంది.

రెండు నుంచి మూడు సంవత్సరాల్లో ప్రతి నాలుగు నెలలకు ఒక్కోక్క కోతలో ఎకరాకు 700 కిలో చొప్పున సంవత్సరానికి 2,100 కిలోల ఆకు దిగుబడి వస్తుంది.

4వ సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక కోతలో 1000 కిలోల చొప్పున 4 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది.

అయిదు సంవత్సరాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక కోతలో ఎకరాకు 2 వేల కిలోల ఆకు చొప్పున ఏడాదికి 8 వేల కిలోల ఆకు దిగుబడి వస్తుంది.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement