పాలమూరు: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి పల్లెకు న్యాయసేవలను తీసుకువెళ్లడానికి పారా లీగల్ వలంటీర్లు బాధ్యత తీసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. అన్ని రకాల చట్టాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడం వల్ల ప్రజలకు అవగాహన పెరుగుతుందన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లాన్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అధ్యక్షతన సోమవారం పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ నిర్వహించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు, చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీలు అందిస్తున్న న్యాయ సేవలు మరింత మెరుగైన స్థాయిలో అందించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న పేదలకు న్యాయం సక్రమంగా అందడం లేదనే విషయం ఎన్నో నివేదికలు చెబుతున్నాయని, ఇలాంటి అంశాలపై వలంటీర్లు దృష్టి సారించాలన్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కారం జరగాలన్నారు. శిక్షణలు ప్రతి వలంటీర్ సద్వినియోగం చేసుకుని నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి ఇందిర, డీపీఓ నర్మద, సహాయ కార్మికశాఖ అధికారి అల్తాఫ్, న్యాయవాదులు కృష్ణ, కార్తీక్, సామాజిక కార్యకర్తలు చంద్రశేఖర్, శివన్న పాల్గొన్నారు.


