జడ్చర్ల టౌన్: జీవ వైవిధ్య సంరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మాజీ చైర్మన్ అచలేందర్‌రెడ్డి, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్‌ఆర్ రాజేందర్‌సింగ్ కోరారు. పట్టణంలోని డా.బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ 6వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మాజీ చైర్మన్ అచలేందర్‌రెడ్డి, కళాశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీఎస్‌ఆర్ రాజేందర్‌సింగ్ హాజరై గార్డెన్‌లో మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం కళాశాల సమావేశ మందిరంలో జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు ఎన్‌సీసీ సభ్యులు గౌరవ వందనం సమర్పించారు. గార్డెన్‌లో దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో ఔషధ మొక్కల కోసం నిర్మించిన చరక నెట్‌హౌస్‌ను అచలేందర్‌రెడ్డి, 1993–96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు చేసిన వాండా ఆర్కిడేరియం, కాక్టస్‌హౌస్‌ను ప్రొఫెసర్ డీఎస్‌ఆర్ రాజేందర్‌సింగ్, ప్రిన్సిపాల్ సుకన్య ప్రారంభించారు.
బొటానికల్ గార్డెన్ తలమానికం
డా.సదాశివయ్య రూపొందించిన బొటానికల్ గార్డెన్ జడ్చర్లకే తలమానికంగా మారిందని, ప్రతి కళాశాలలోనూ మొక్కలు నాటి ప్రకృతి పరిరణక్షకు పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల రాష్ట్రానికే ఆదర్శ కళాశాలగా మారిందన్నారు. గార్డెన్ సమన్వయకర్త డా.సదాశివయ్య మాట్లాడుతూ ఆరేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. 852 జాతులు, 8 వేల పైచిలుకు మొక్కలను సంరక్షిస్తున్నామని వివరించారు. జీవవైవిధ్య సంరక్షణకు, పరిశోధనలకు గార్డెన్ కేంద్రబిందువుగా మారిందన్నారు. గార్డెన్ అభివృద్ధికి సహకరించిన పూర్వవిద్యార్థులు, పట్టణవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో ప్రిన్సిపాల్ డా.సుకన్య, వైస్‌ప్రిన్సిపాల్ నర్మద, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు పాల్గొన్నారు.
స్కిల్ ఓరియంటెడ్
కోర్సులతో సంపాదన
విద్యార్థులు చదువుతోపాటు స్కిల్ ఓరియంటెడ్ కోర్సుల ద్వారా భావితరాలు చదువుతో పాటు సంపాదించడం నేర్చుకోవాలని నేషనల్ బయోడైవర్సిటి మాజీ చైర్మన్ అచలేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బొటానికల్ గార్డెన్‌లో సంరక్షిస్తున్న అరుదైన ఔషధ మొక్కలు, అటవీ జాతుల మొక్కలను తక్కువ ఖర్చుకై నా అమ్మి గార్డెన్‌కు సంపాదన వచ్చేలా చేయాలన్నారు.


