ఉండవెల్లి: మండలంలోని పుల్లూరు శివారులోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉండవెల్లికి చెందిన తల్లి కుమారుడు సర్తాజ్ బేగం, మజూర్ (19) బైక్‌పై కర్నూలుకు బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో తల్లి పక్కనే పడిపోగా కుమారుడు ఎగిరిపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108లో కర్నూలు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో తల్లి కన్నిటిపర్యంతమయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ యువతి మృతి
తెలకపల్లి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేష్ తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని గడ్డంపల్లి గ్రామానికి చెందిన వడ్డెమాన్ భార్గవి (21)కు తండ్రి పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి నిశ్చయం కోసం ఈనెల 15న తెలకపల్లికి వెళ్లగా అదే రోజు సాయంత్రం భార్గవి క్రిమి సంహారక మందు తాగి అత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు తండ్రికి సమాచారం అందింంచి చికిత్స నిమిత్తం నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి మరణించింది. భార్గవి వేరే యువకుడిని ఇష్టపడుతుందని, ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆలయంలో చోరీ..
కేసు నమోదు
ఉప్పునుంతల: మండలంలోని జప్తీ సదగోడు లో గల పెద్దమ్మ ఆలయంలో ఆదివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి వెండి విగ్రహం, వడ్డానం, బంగారు మాంగల్యం, ముక్కుపుడకను అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం స్థానిక యాదవ సంఘం నాయకులు ఆలయంలోకి రాగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందాన్ని రప్పించి ఆలయంలో వేలి ముద్రలను సేకరించినట్లు పేర్కొన్నారు.
మొగుల్‌మడ్కలో నగదు, నగలు చోరీ
దామరగిద్ద: మండలంలోని మొగుల్‌మడ్క గ్రామానికి చెందిన మహామ్మద్ ఆసిఫ్ ఇంట్లో దొంగలు ప్రవేశించి నగలుతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. ఆసిఫ్ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల పోలెపల్లి ఎల్లమ్మ జాతరకు ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాడు. కాగా సోమవారం ఉదయం గ్రామానికి వచ్చి ఇంటిని తెరిచి చూడగా బీరువా తలపులు తెరిచి ఉండటాన్ని చూసి కంగుతిన్నాడు. బీరువాల్లో దాచి ఉంచిన 15 తులాల వెండి, 10 వెండి ఉంగరాలు. కాళ్లపట్టీలు, రూ.20 వేల నగదు చోరీ చేసినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.


