● గోదాంలో 250 సిలిండర్ల వ్యత్యాసం
అచ్చంపేట రూరల్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని తహసీల్దార్ సైదులు హెచ్చరించారు. పట్టణంలోని లక్ష్మీప్రసన్న గ్యాస్ ఏజెన్సీ(భారత్) గోదాంను సోమవారం ఆయన తనిఖీ చేశారు. గోదాంలోని సిలిండర్ల నిల్వలను పరిశీలించారు. అలాగే ఏజెన్సీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించగా 250 సిలిండర్లు వ్యత్యాసం వచ్చినట్లు గుర్తించారు. దీంతో కలెక్టర్‌కు నివేదిక అందించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు సకాలంలో సిలిండర్లు అందించకుండా కృత్రిమ కొరతకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుందని, డెలివరీ పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. తనిఖీలో ఎంఆర్‌ఐ శివ, ఆర్‌ఐ బాల్‌రాం, సిబ్బంది పాల్గొన్నారు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పట్టివేత
బిజినేపల్లి: మండల కేంద్రంలోని పలు హోటళ్లలో మండల రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత నెలకొనడంతో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ దాడులు చేపట్టినట్లు డిప్యూటి తహాసీల్దారు రవికుమార్ తెలిపారు. సోమవారం నిర్వహించిన దాడులలో 10 దుకాణాలలో 20 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.


