జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా కేంద్రంలోని క్రిష్టియన్‌పల్లిలో 523 సర్వే నంబర్‌లో ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాల పట్టా సర్టిఫికెట్లను అప్పటి ప్రభుత్వం తీసుకుని డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించలేదని టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం ఖలీల్ అన్నారు. పట్టాలు తీసుకున్న ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం కలెక్టరేట్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అప్పటి కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మాటను నమ్మి అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో తమ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అప్పటి నుంచి బాధితులు ఇండ్లకోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఏడేళ్లు గడుస్తున్నా కలెక్టర్ హామీ నెరవేరకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుత కలెక్టర్ గత కలెక్టర్ హామీని అమలు చేసి ప్రభుత్వ పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికై నా కలెక్టర్ పట్టా సర్టిఫికెట్లు ప్రభుత్వానికి స్వాధీనపరిచిన వాళ్లందరికీ తక్షణం డబుల్‌బెడ్రూం ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు జలాల్ పాషా, గట్టన్న, డబుల్ బెడ్రూం బాధితులు పాల్గొన్నారు.


