● అప్పుడే నిందితులకు శిక్షలు పడతాయి: ఎస్పీ జానకి
పాలమూరు/హన్వాడ: ఇటీవల మూడు పోక్సో కేసులతో పాటు ఒక రాబరీ, ఒక అత్యాచార కేసులలో నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్షలు పడటంలో కీలక పాత్ర పోషించిన అధికారులను, పోలీస్ సిబ్బందిని సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి సన్మానించడంతో పాటు ప్రశంసాపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో పోలీస్ అధికారులు సేకరించిన బలమైన సాక్ష్యాధారాలు, న్యాయ శాఖ అధికారుల సమర్ధమైన వాదనల వల్ల నిందితులకు కఠిన శిక్షలు పడటం సాధ్యమైందన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్, న్యాయ శాఖలు సమన్వయంతో పని చేయడం అత్యంత ముఖ్యమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
హన్వాడ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
హన్వాడ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సాయంత్రం ఎస్పీ డి.జానకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, ఇతర కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణపై సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల పోలీసులు బాధ్యతగా ఉండాలని, ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత సకాలంలో పరిష్కరించాలన్నారు. నేరాల నియంత్రణలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, సమాజంపై పడే ప్రతికూల ప్రభావాల గురించి ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకటేష్, సిబ్బంది పాల్గొన్నారు.


