అచ్చంపేట రూరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ధర్మగిరి వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో నిర్వహించిన శ్రీవేంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో నల్లమల ప్రాంతానికి చెందిన మద్దిమడుగు దేవస్థానం ప్రధాన అర్చకుడు వీరయ్య శాస్త్రి కుమారుడు డాక్టర్ ఎస్.ఎస్. శివప్రసాద్‌శర్మ ఉత్తరభాగ శాస్త్రపరీక్షలో విజయాన్ని సాధించారు. వేద, శాస్త్ర, ఆగమ విద్యల అభివృద్ధి కోసం 1969లో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పండితుల పాండిత్యాన్ని కఠిన పరీక్షల ద్వారా పరిశీలించి ఉత్తీర్ణులైన వారికి పట్టాలు ప్రదానం చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు 13 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 6 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో డాక్టర్ శివప్రసాద్‌శర్మ ఒక్కడే ఉత్తీర్ణత సాధించడం ప్రత్యేకతగా నిలిచింది. గత నలభై సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలో ఉత్తరభాగ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారు కేవలం కొద్ది మందే ఉండటం, అందులో ఆయన సాధించిన విజయం విశేష ప్రాధాన్యం పొందింది. ఈ సందర్భంగా శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతి స్వామిజీ చేతుల మీదుగా ఆయనకు ప్రమాణపత్రం అందజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘనతను పొందిన రెండో పండితుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తొలి పండితుడిగా నిలిచిన డాక్టర్ శివప్రసాద్ శర్మను నల్లమల ప్రాంతంలోని పలువురు అభినందనలు తెలియజేశారు.


