అడ్డాకులకు మార్కెట్‌ యార్డు | - | Sakshi
Sakshi News home page

అడ్డాకులకు మార్కెట్‌ యార్డు

Mar 16 2026 8:40 AM | Updated on Mar 16 2026 8:40 AM

డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం

యార్డు పరిధిలోకి వచ్చే గ్రామాలివే..

అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లాకు మరో వ్యవసాయ మార్కెట్‌ యార్డు మంజూరైంది. దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకులలో మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేవరకద్ర నియోజకవర్గంలో దేవరకద్రతోపాటు ప్రస్తుతం వనపర్తి జిల్లా పరిధిలో ఉన్న మదనాపురంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. తాజాగా అడ్డాకులకు మార్కెట్‌ యార్డు మంజూరు కోసం ప్రభుత్వం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఆ సంఖ్య మూడుకు చేరనుంది. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అడ్డాకులలో మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడంతో ఇటీవల ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్‌ మండలాల్లోని రైతులు పండించిన ధాన్యం సులువుగా విక్రయించుకునే సౌకర్యం ఈ మార్కెట్‌ యార్డు ద్వారా కలగనుంది.

రైతుల సౌలభ్యం కోసమే..

దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపురం మార్కెట్‌ యార్డుకు అడ్డాకుల, మూసాపేట మండలాలు అనుసంధానంగా ఉండేవి. అదేవిధంగా బాదేపల్లి మార్కెట్‌ యార్డుకు నియోజకవర్గంలోని భూత్పూర్‌ మండలం అనుసంధానంగా ఉంది. అయితే అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని రైతులు తమ ఉత్పత్తులను మదనాపురం తీసుకెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారి సౌలభ్యం కోసం దేవరకద్ర నియోజకవర్గానికి మరో మార్కెట్‌ యార్డు మంజూరు చేయాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి ఉన్నతాధికారులను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అడ్డాకులలో మార్కెట్‌ యార్డు ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటయ్యే కొత్త మార్కెట్‌ యార్డు అడ్డాకులదే కావడం విశేషం.

మూడు మండలాలతో..!

అడ్డాకుల మార్కెట్‌ యార్డు పరిధిలో అడ్డాకులతోపాటు మూసాపేట, భూత్పూర్‌ మండలాలను కలిపారు. భూత్పూర్‌ మండలాన్ని బాదేపల్లి మార్కెట్‌ యార్డు నుంచి, అడ్డాకుల, మూసాపేట మండలాలను మదనాపురం మార్కెట్‌ యార్డు నుంచి వేరు చేసి కొత్తగా ఏర్పాటు చేసే అడ్డాకుల మార్కెట్‌ యార్డులో చేర్చారు. అడ్డాకుల శివారులోని సర్వే నంబర్‌ 161లోని ఆరున్నర ఎకరాల స్థలంలో మార్కెట్‌ యార్డు ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ మార్కెట్‌ యార్డు ఏర్పాటైతే రైతుల ఉత్పత్తుల విక్రయాలు సులభతరం కావడంతోపాటు హమాలీలు, ఇతర కూలీలకు ఇక్కడ ఉపాధి కలగనుంది.

రైతులకు ఎంతో మేలు..

దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తగా అడ్డాకులకు మార్కెట్‌ యార్డును మంజూరైంది. దీంతో మూడు మండలాల రైతులకు ఈ మార్కెట్‌తో ఎంతో మేలు జరగనుంది. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు సులభతరం కావడంతోపాటు హమాలీలు, కూలీలకు స్థానికంగా ఉపాధి కలుగుతుంది. రైతుల ఉత్పత్తులకు మంచి ధర కూడా లభించనుంది. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందనడానికి ఇదే నిదర్శనం.

అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్‌ రైతులకు ప్రయోజనం

బాదేపల్లి, మదనాపురం నుంచి

పై మూడు మండలాల తొలగింపు

ఫలించిన ఎమ్మెల్యే కృషి..

రైతన్నల హర్షం

అడ్డాకుల మండలంలోని గుడిబండ, కాటవరం, కందూరు, అడ్డాకుల, చిన్నమునుగల్‌ఛేడ్‌, కన్మనూర్‌, ముత్యాలంపల్లి, పెద్దమునుగల్‌ఛేడ్‌, రాచా ల, తిమ్మాయిపల్లి, శాఖాపూర్‌, వర్నె, బలీదుపల్లి, పొన్నకల్‌, తిమ్మాయిపల్లి తండా, రాంచంద్రాపూ ర్‌, సుంకరామయ్యపల్లి గ్రామాలున్నాయి.

మూసాపేట మండలంలోని నందిపేట, దాసర్‌పల్లి, తుంకినీపూర్‌, వేముల, మూసాపేట, నిజాలాపూర్‌, జానంపేట, అచ్చాయపల్లి, కొమి రెడ్డిపల్లి, చక్రాపూర్‌, కనకాపూర్‌, పోల్కంపల్లి, తిమ్మాపూర్‌, సంకలమద్ది, మహ్మదుస్సేన్‌పల్లి.

భూత్పూర్‌ మండలంలోని అన్నాసాగర్‌, అమిస్తాపూర్‌, గోప్లాపూర్‌, భూత్పూర్‌, హస్నాపూర్‌, కప్పెట, కర్వెన, కొత్త మొల్గర, కొత్తూరు, మద్దిగట్ల, పోతులమడుగు, రావులపల్లి, తాటికొండ, తాడిపర్తి, ఎల్కిచర్ల ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement