చేనేత కార్మికులది గొప్ప కళా నైపుణ్యం | - | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికులది గొప్ప కళా నైపుణ్యం

Mar 15 2026 6:05 AM | Updated on Mar 15 2026 6:05 AM

నారాయణపేట: కంచి వస్త్రాలతో గద్వాల, నారాయణపేట చీరలు డిమాండ్‌లో పోటీ పడుతున్నాయని.. చేనేత కార్మికులది గొప్ప కళా నైపుణ్యమని.. ఇక్కడ నేచిన చీరలు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం మండలంలోని కోటకొండలో చేనేత కార్మికులకు చేనేత మగ్గాలు, ఇతర పరికరాల మొదటి విడత పంపిణీ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేసి మాట్లాడారు. చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఆలోచనతో కేంద్రం నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్ట్‌ కింద కోటకొండను హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. చేనేత కార్మికులకు రూ.కోటి రెండు లక్షల నిధులతో చేనేత పరికరాలను పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మొదటి విడతలో 70మంది చేనేత కార్మికులకు వచ్చిన పరికరాలను సరైన విధంగా ఉపయోగించుకుంటే రెండో విడతలో పరికరాలు వస్తాయన్నారు. చేనేత కార్మికులు మరింత ఆర్థికంగా స్థిరపడతారన్నారు. జక్కడ్లు, ఇతర పనిముట్లు ఉపయోగించుకొని చేనేత కార్మికులు లబ్ధి పొందితే కేంద్రం లక్ష్యం నెరవేరుతుందన్నారు. నారాయణపేట, గద్వాల చీరలు పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నాయన్నారు. చేనేత వస్త్రాలకు రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతుందన్నారు. చేనేత కార్మికులందరూ ఎప్పటికప్పుడు కొత్తకొత్త డిజైన్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నారు. సరికొత్త డిజైన్‌లతో మార్కెట్‌తో పోటీపడి డిమాండ్‌ పెంచుకోవాలన్నారు. అలాగే మార్కండేయ స్వామి కమ్యూనిటీ హాల్‌పై మరో అంతస్తు నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి తప్పకుండా సహకరిస్తాన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటయ్యగౌడ్‌, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు రతంగ్‌పాండురెడ్డి, శ్రీనివాస్‌, సత్యయాదవ్‌, రఘురామయ్యగౌడ్‌, కెంచె శ్రీనివాస్‌, హ్యాండ్లూం అధికారి బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement