పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు | - | Sakshi
Sakshi News home page

పుట్టెడు దుఃఖంలోనూ పరీక్షకు హాజరు

Mar 15 2026 6:05 AM | Updated on Mar 15 2026 6:05 AM

నారాయణపేట రూరల్‌: జీవితంలో కొన్ని క్షణాలు మనసును బరువెక్కిస్తాయి. కానీ బాధను మించిపోయే బాధ్యతలు కూడా ఉంటాయి. అలాంటి హృదయాన్ని కదిలించే ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. తాత మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగినా.. చదువుపై ఉన్న నిబద్ధతతో మనవడు పుట్టెడు దుఃఖంలోనూ పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట మండలం జలాల్‌పూర్‌కు చెందిన అరవింద్‌ జిల్లా కేంద్రంలోని హంసవాహిని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కావడంతో అతడు కూడా పరీక్షకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడి తాత భీంశప్ప (70) తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్న తాత మృతితో అరవింద్‌ కూడా తీవ్రంగా కలత చెందాడు. అయితే తన భవిష్యత్‌కు ఎంతో ముఖ్యమైన పదో తరగతి పరీక్షను వదులుకోకూడదని భావించాడు. గుండెల్లో తాత జ్ఞాపకాలతోనే కన్నీరు తుడుచుకుంటూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కేటాయించిన పరీక్షా కేంద్రంలో తెలుగు పరీక్షకు హాజరయ్యాడు. పుట్టెడు దుఃఖంలోనే పరీక్షను పూర్తిచేశాడు. అనంతరం తాత భీంశప్ప అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement