కృష్ణా: మండలంలోని ముడుమాల్ గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కురువ హన్మేష్(27) అదే గ్రామానికి చెందిన తాయమ్మలు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దలను ఒప్పించి 2017లో వారు పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు, కూతురు ఉన్నారు. హన్మేష్ వృత్తి రీత్యా గొర్రెలను కాచేందుకు అడవికి వెళ్తుంటాడు. ఈ క్రమంలో భార్య అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న హన్మేష్ నెలరోజుల క్రితం భార్యను, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని హెచ్చరించాడు. అయినా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుండటంతో మానసిక వేధనకు గురై శుక్రవారం మధ్యాహ్నం పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి పద్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో హన్మేష్ మృతికి కారణమైన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని, ఆ తర్వాతే మృతదేహాన్ని ఖననం చేస్తామని మృతుడి కుటుంబ సభ్యులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ నవీద్ కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని, నిందితుడిపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించిన వారు మృతదేహాన్ని ఖననం చేసేందుకు అంగీకరించారు.
● ప్రేమించి పెళ్లి చేసుకున్న మోసం చేసిన వైనం
ఖననం చేసేందుకు కుటుంబ సభ్యుల నిరాకరణ


