స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని రెడ్‌క్రాస్ భవన్‌లో శనివారం పాలమూరు సాహితీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీపరాభవ ఉగాది కవి సమ్మేళనం అలరించింది. కవి సమ్మేళనంతో పాటు బోల యాదయ్య రచించిన తండ్లాట అనువాద కృతి ‘హార్ట్ బీట్’ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు వి.మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతో మంది యువ కవులు రావడానికి, రాయడానికి ఇలాంటి కవి సమ్మేళనాలు ఉపయోగపడతాయన్నారు. కవిత్వం అంటే ఒక రకమైన తండ్లాట అని అన్నారు. హార్ట్ బీట్ పుస్తకావిష్కర్త బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ పాలమూరు కవిత్వం ప్రపంచస్థాయిలో రాణించాలంటే మన కవిత్వం ఆంగ్లంలోకి అనువాదం కావాలన్నారు. బోల కవిత్వాన్ని అనువాదం చేసిన పుస్తక అనువాదకులు సానె శివశంకర్‌ను ఈ సందర్భంగా అభినందించారు. బైరెడ్డి సతీష్‌రెడ్డి పుస్తకాన్ని సమీక్షించారు. అనంతరం శ్రీపరాభవ ఉగాది పురస్కారాలను ప్రముఖ కవి, నటులు ఏపూరి కిష్టప్ప, ప్రముఖ కవయిత్రి టి.అంబుజలకు అందజేశారు. పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, లక్ష్మణ్‌గౌడ్, ఉదయమిత్ర పాల్గొన్నారు.


