● పక్కదారి పడుతున్న గ్యాస్ సిలిండర్లపై ఫోకస్
● ముమ్మరంగా దాడులు చేస్తున్న
అధికారులు
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలో గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న అక్రమాలపై పౌర సరఫరాల శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గ్యాస్ సిలిండర్ల పక్కదారి వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.శుక్రవారం పౌర సరఫరాల శాఖ అధికారులు మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో గృహ వినియోగానికి మాత్రమే అనుమతించిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై అధికారులు 31 (6ఏ) కేసులు నమోదు చేసి మొత్తం 54 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి గంప శ్రీనివాస్‌తో పాటు అధికారులు రాజీవ్‌రెడ్డి, డి.ఆదిత్యగౌడ్, ఎస్.మమత, దీపక్, ఎండీ అమేర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
పాత సమస్య.. కొత్త తనిఖీలు
జిల్లాలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు వాణిజ్య సిలిండర్లకు బదులుగా తక్కువ ధరకు లభించే గృహ సిలిండర్లనే వినియోగిస్తున్నారనే ఆరోపణలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీల సహకారంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై గతంలో పెద్దగా చర్యలు తీసుకోలేదని ప్రజలు చెబుతున్నారు. కొంతమంది అక్రమార్కులు అధికారులకు మామూల్లు ఇచ్చి గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.


