గండేడ్: రెండు మండలాల సరిహద్దును ఆసరాగా చేసుకొని అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణకు తెరలేపారు. ట్రాక్టర్లలో తెచ్చి రెండు మండలాల సరిహద్దుల్లో పోస్తున్నారు. టిప్పర్లలో రాత్రికి రాత్రికి ఎత్తేస్తున్నారు. ఇందుకు అధికారుల అండదండలు మెండుగా ఉండడంతో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఓవైపు ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని మోత్తుకుంటున్నా అక్రమార్కులు, అధికారులు వాటిని తుంగలో తొక్కేస్తున్నారు. గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామం మండలంలోని శివారు, మారుమూల గ్రామం. ఈ గ్రామం దాటితే కోయిల్‌కొండ మండలం పరిధి. ఈ మండలంలోని సురారం ఇసుకకు ప్రత్యేకత. ఇక్కడ పెద్దవాగు ఉండడం మూలంగా ఇసుక ఎక్కువగా లభిస్తుంది. ఈ ఇసుక నాణ్యమైనదిగా ఉండడంతో ఎక్కువగా దీనికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే అక్కడినుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గండేడ్ మండలంలోని పగిడ్యాల్‌తోపాటు కొండాపూర్, బల్సుర్‌గొండ, తువ్వగడ్డతండా, మన్సూర్‌పల్లి తదితర గ్రామాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. నేరుగా ఇళ్లు కట్టుకునేవారికి ఇసుక వేయడంతోపాటు బయటికి తరలించేందుకుగాను టిప్పర్లకోసం డంపులు వేస్తున్నారు.
రెండు మండలాల సరిహదులో..
కోయిల్‌కొండ మండలంలోని కొత్లాబాద్, గండేడ్ మండలంలోని పగిడ్యాల్ గ్రామాల సరిహద్దులో కొత్లాబాద్ చెరువు సమీపంలో సురారం గ్రామానికి చెందిన వారు ట్రాక్టర్లలో తెచ్చి డంపులు పోస్తున్నారు. ఉదయం, సాయంత్రం 10 నుంచి 20 ట్రాక్టర్లలో తెచ్చి డంపు పోస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ రూ.2వేల నుంచి రూ.3వేలకు ఒక ట్రిప్పు చొప్పున పోస్తున్నారు. ఇది ప్రతిరోజు కొనసాగుతున్నది. అలా పోసిన ఇసుకను గండేడ్ మండలానికి చెందిన కొందరు వాటిని టిప్పర్లలలో నింపి రాత్రి వేళల్లో గుట్టుగా కోస్గి, పరిగి, కుల్కచర్ల తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మండలంలో మూడు టిప్పర్లు నిత్యం అక్రమంగా ఇసుకను రాత్రివేళల్లో తరలిస్తున్నాయి. దీంతోపాటు సురారం, లింగల్‌చేడ్‌కు చెందిన మరో మూడు టిప్పర్లు కూడా గండేడ్ మహమ్మదాబాద్ మండలాలతోపాటు ఇతర ప్రాంతాలకు సురారం నుంచే ఇసుకను తరలిస్తున్నాయి. పగిడ్యాల్ శివారులో మరో రెండుచోట్ల కూడ ఇసుక డంపులు పోస్తున్నారు. జేసీబీల సహాయంతో యథేచ్చగా టిప్పర్లు నింపి తరలిస్తున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
రూ.3వేల వరకు వసూలు
అక్రమ రవాణాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దందా సాఫీగా నడవడానికి టాక్టర్లు, టిప్పర్ల నుంచి రెండునుంచి మూడువేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వసూలు చేసిన డబ్బులు ఆయా శాఖల అధికారులకు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా కారణంగా ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా ఒక ట్రాక్టరు రూ.5వేలకు ఓ ట్రిప్పు వేస్తున్నారు.
అధికారుల అండదండలు పుష్కలం
కోయిల్‌కొండ మండలం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అక్కడి అధికారులు కిమ్మనకపోవడమేకాక వారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కోసారి వరుసకట్టి ట్రాక్టర్లు వస్తున్నా కూడ అటు కోయిల్‌కొండ కాని ఇటు గండేడ్ మండల అధికారులు కాని ఎవరూ పట్టించుకోవడంలేదు. ఈతంతు దాదాపు నాలుగైదు నెలలుగా కొనసాగుతున్నా ఒక్క ట్రాక్టర్‌గాని టిప్పర్‌గాని పట్టుకున్న దాఖలాలు లేవు. దీనికి తోడు జేసీబీతో లోడు చేస్తున్న కూడా అధికారుల్లో చలనం లేదు. ఈ విషయం అధికారులను అడిగితే మాకేమీ సమాచారం లేదని అమాయకంగా సమాధానం ఇస్తున్నారు. కనీసం సంబంధిత జీపీఓలు కూడా అక్రమ రవాణా గురించి పట్టించుకోవడం లేదంటే విడ్డూరంగా ఉంది.
అధికారుల అండదండలతో జోరుగా ఇసుక రవాణా
సురారం నుంచి పగిడ్యాల్ మీదుగా ఇతర ప్రాంతాలకు..
ట్రాక్టర్లలతో తరలించి టిప్పర్లతో చేరవేస్తున్న ఇసుకాసురులు
అరికట్టడంలో విఫలమవతున్న అధికారం యంత్రాంగం


