ఖమ్మం తరహా క్రిష్టియన్‌పల్లి బాధితులకు
● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
● 523 సర్వేనంబర్
బాధితుల ధర్నాకు మద్దతు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో ఇండ్లు కూలగొట్టిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన విధంగానే మహబూబ్‌నగర్‌లోని క్రిస్టియన్‌పల్లి 523 సర్వే నంబర్‌లో కూలగొట్టిన ఇండ్ల బాధితులకు కూడా కూలగొట్టిన ప్రాంతంలో ఇండ్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆదర్శనగర్‌లో బాధితులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు మద్దతు తెలిపిన ఆయన మాట్లాడుతూ.. అంధులు, వికలాంగులు నివాసముంటే ఇండ్లను అర్ధరాత్రి వచ్చి కూలగొట్టారని ఆరోపించారు. ఇక్కడ చెరువులేదని, ప్రభుత్వ భూమిని ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఇచ్చిందని.. ఇవేమీ పట్టించుకోకుండా అధికారులు కూలగొట్టడం దుర్మార్గమన్నారు. కొందరు వచ్చి ఇప్పటికీ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రతిఒక్కరూ మానవీయ కోణంలో ఆలోచన చేయాలని, రాజకీయంగా ఆలోచించి ప్రత్యేక అవసరాలు కలిగిన వారి జీవితాలతో ఆడుకోవడద్దన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పోలీస్ అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
● 523 సర్వే నంబర్ బాధితుడు ఎల్లప్ప మాట్లాడుతూ.. ఖమ్మం తరహా ఇండ్లు కూలగొట్టిన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరారు. మమ్మల్ని భయపెట్టాలని చాలామంది చూస్తున్నారని, ఎవరికీ భయపడేదిలేదన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, కార్పొరేటర్లు హైందవి, మధుమోహన్, రమేశ్‌నాయక్, శరత్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు క్రాంతి, పాల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


