దేవరకద్ర రూరల్: పంటలు ఎండుతున్నాయి.. కరెంట్ ఇవ్వండి సారూ అని వెంకటగిరి, ఇస్రంపల్లికి చెందిన రైతులు గురువారం కౌకుంట్లలోని సబ్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. త్రీఫేస్ కరెంట్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, సమస్య పరిష్కరించాలని ట్రాన్స్‌కో అధికారులను వేడుకున్నారు. కొన్ని రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రమైందని, పరిస్థితి ఇలాగే ఉంటే కళ్లెదుటే చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతాయని వాపోయారు. సమస్యపై బాధిత రైతులతో ఏడీ సంతోష్ ఫోన్‌లో మాట్లాడుతూ.. లోఓల్టేజ్ వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి, అంతరాయం లేకుండా త్రీఫేస్ అందిస్తామని హామీ ఇచ్చారు.


