● ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాయచూర్ జిల్లా బంధ్
● సరిహద్దులో నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
కృష్ణా: రాష్ట్ర సరిహద్దులోని టైరోడ్డులో రాయచూర్ జిల్లా పోలీసులు బుధవారం తెల్లవారుజాము నుంచే రాయచూర్‌కు వెళ్లనివ్వకుండా వాహనాలను నిలిపేశారు. సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలో ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలని అదే విధంగా బడ్జెట్‌లో దళితుల సంక్షేమానికి నిధులు కేటాయించకపోవడంతో ఆగ్రహించిన దళిత సంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాయచూర్ జిల్లా బంధ్‌కు పిలుపునిచ్చారు. దీంతో కర్ణాటక పోలీసులు సరిహద్దు గ్రామాల నుంచి వాహనాలను అనుమతించకపోవడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మక్తల్ సీఐ రాంలాల్, కృష్ణా ఎస్‌ఐ నవీద్, మక్తల్ ఎస్‌ఐ భాగ్యలక్ష్మారెడ్డిల ఆధ్వర్యంలో బందబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి రాయచూర్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులను టైరోడ్డు నుంచే వెనక్కి పంపించి వేశారు. దీంతో రాయచూర్ పట్టణానికి వెళ్లే ప్రయాణికులు కాలినడకన అలాగే కొందరు ద్విచక్రవాహనాలపై ఆపసోపాలు పడుతూ వెళ్లారు. బంధ్‌కు పిలుపునిచ్చిన సమయంలో కనీసం ముందస్తుగా సమాచారం అందించినట్లయితే తమ ప్రయాణాలను వాయిదా వేసుకునేవాళ్లమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాయంత్రం వరకువాహనాల నిలిపివేత
ఎమ్మార్పీఎస్ నాయకులు రాయచూర్ జిల్లాకు బంధ్ పిలుపు నివ్వడంతో ఎస్పీ ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దులోని టైరోడ్డులో వాహనాలను నిలిపేశాం. ముందస్తు జాగ్రత్తగా సాయంత్రం వరకు అనుమతించడం లేదు. ఈ విషయంపై ఆర్టీసీ డిపోలకు ముందస్తు సమాచారం అందించాం.
– నారాయణ, ఎస్‌ఐ, శక్తినగర్


