● జిల్లాలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు
● సీసీ కెమెరాలు, నెట్ సౌకర్యం ఉన్నవాటికి
డీఈఓ కార్యాలయంతో అనుసంధానం
● 10 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు.. ప్రత్యేకంగా సిట్టింగ్ స్క్వాడ్ నియామకం
● ఆన్‌లైన్‌లో అందుబాటులో హాల్‌టికెట్లు
● 60 కేంద్రాల ఏర్పాటు.. పరీక్ష రాయనున్న 13,217 మంది విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో శనివారం నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా విద్యా శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి కాపీయింగ్ జరగకుండా, ఇతరత్రా సమస్యలు ఎదురుకాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 10 సమస్యాత్మక సెంటర్లను గుర్తించారు. ఇందులో కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ పూర్తిస్థాయిలో సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించనున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాకేంద్రంలోని కొన్ని పాఠశాలలు అడ్రస్ మారిన పాత పాఠశాల భవనం పేరు మీద ఎస్సెస్సీ విద్యార్థుల నామినల్ రోల్స్ సమర్పించినట్లు తెలుస్తుంది. భవనం మారినప్పటికీ కొత్త భవనం మారి సుమారు నాలుగేళ్లు గడుస్తున్నా.. కొత్త పాఠశాల పేరు మీద అసలు అనుమతులు తీసుకోకుండా పాత పాఠశాల భవనంలో తరగతులు నిర్వహిస్తున్నట్లు నామినల్ రోల్స్ సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు ఎంఈఓ కార్యాలయంలోని కొంతమంది సిబ్బంది లోపాయికారిగా సహకరిస్తున్నట్లు తెలుస్తుంది.
సీసీ కెమెరాలు ఏర్పాటు..
జిల్లాలో మొత్తం 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 40 ప్రభుత్వ పాఠశాలలు కాగా.. 20 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కెమెరాలను ప్రధానంగా ప్రశ్నాపత్రం తెరిచే గదిలో మాత్రమే ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్‌నెట్, సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో ఉన్నవాటిని జిల్లా డీఈఓ కార్యాలయానికి అనుసంధానం చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
● జిల్లాలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని యాజమాన్యాలు వేధిస్తున్నారని, ఫీజుల కోసం ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు పేర్కొంటున్నారు. అధికారులు మాత్రం ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్‌లు అందుబాటులో ఉన్నాయని, నేరుగా హాల్‌టికెట్ తీసుకుని పరీక్షకు విద్యార్థులు వెళ్లవచ్చని సూచిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..
పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పదో తరగతి విద్యార్థులకు హాల్‌టికెట్ ఇవ్వడానికి ఫీజులు అడగడం సరికాదు. అలా ఎవరైనా అడిగితే విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షకు వెళ్లవచ్చు. ఇక పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నాపత్రం తెరిచే దగ్గర మాత్రం తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ఐదు నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతి ఉంటుంది. తప్పుడు అడ్రస్ ఇచ్చిన పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
– ప్రవీణ్‌కుమార్, డీఈఓ


