మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని పలు హోటళ్లను బుధవారం మున్సిపల్ కార్పొరేషన్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మూకుమ్మడిగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నాలుగు చోట్ల ఆహార పదార్థాలలో శుచి, శుభ్రత పాటించడం లేదని గుర్తించారు. ఒక స్టార్ హోటల్‌లో ఒకరోజు ముందు వండిన అన్నం, చికెన్ నిల్వ ఉన్నట్లు వారి పరిశీలనలో బయటపడింది. అలాగే కొత్తబస్టాండు సమీపంలోని ఓ బేకరీలో ఎక్స్‌పైరీ డేట్ దాటిన పదార్థాలు ఉండగా వాటిని పారబోయించారు. దీంతో నలుగురు యజమానులకు కలిపి మొత్తం రూ.13వేల జ రిమానా విధించారు. దాడుల్లో శానిటరీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మయ్య, హెల్త్ అసిస్టెంట్ వజ్రకుమార్‌రెడ్డి, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.
పడిపోయిన ఉల్లి ధరలు
● క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,200, కనిష్టంగా రూ.900
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు సుమారు 6 వేల బస్తాలలో ఉల్లిని అమ్మకానికి తీసుకురావడంతో యార్డు మొత్తం ఉల్లి కుప్పలతో నిండిపోయింది. అయితే దిగుబడులు పెరగడంతో ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ వారం వేలంలో ఉల్లి ధరలు బాగా పడిపోయాయి. క్వింటాల్ ఉల్లి గరిష్టంగా రూ.1,200, కనిష్టంగా రూ.900 వరకు ధర పలికింది. ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చాలామంది తెచ్చిన ఉల్లిని తిరిగి తీసుకుపోలేక వచ్చిన ధరలకే విక్రయించారు. స్థానిక వ్యాపారులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు వేలంలో పాల్గొని ఉల్లిని కొనుగోలు చేశారు. బయట నుంచి వచ్చిన వ్యాపారులంతా కొనుగోలు చేసిన ఉల్లిని వాహనాల్లో తరలించారు. మార్కెట్ వ్యాపారులు 50 కిలోల బస్తాలుగా తూకం వేసి గరిష్టంగా రూ.600, కనిష్టంగా రూ.450 చొప్పున విక్రయించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉల్లి వేలం కాగా సాయంత్రం వరకు విక్రయాలు కొనసాగాయి.
‘ఉపాధిహామీ’పై నిర్లక్ష్యం తగదు
అమరచింత: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై వివక్ష చూపుతూ లక్ష్యాన్ని నీరుగార్చే కుట్రలు చేస్తోందని.. ఉపాధి కూలీలకు అండగా నిలుస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి శివారులో ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వీబీజీ రాంజీగా పేరు మార్చి జీఓ తీసుకురావడం దారుణమన్నారు. కొత్త చట్టంతో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలనే నిబంధన విధించడం సిగ్గుమాలిన చర్యగా అభి వర్ణించారు. అదేవిధంగా సంక్రాంతి నుంచి పనులు చేస్తున్నా కూలి డబ్బుల అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లో కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించలేని స్ధితిలో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండలు ముదురుతున్నందున నీడ కోసం షేడ్‌నెట్‌లు ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలని కోరారు. రోజువారి కూలి రూ.307 చెల్లిస్తున్నారని.. మారుతున్న కాలానికి అనుగుణంగా రూ.800 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 200 పనిదినాలు, రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పనులు తొలగించడంతో వ్యవసాయ కూలీలు పనులు దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. మున్సిపల్, అర్బన్ ప్రాంతాల్లో సైతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పని అడిగిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని.. లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామన్నారు.


