● హాజరుకానున్న మంత్రులు,
ఎంపీలు, ఎమ్మెల్యేలు
● ఏర్పాట్లను పర్యవేక్షించిన
కలెక్టర్ ఖుష్బూ గుప్తా
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఇటీవల నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె జిల్లాకేంద్రంలోని అనంత మారుతి గార్డెన్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. శిక్షణకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్లు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు పది థీమ్‌లపై చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు అవగాహన కల్పిస్తారన్నారు. ఒకరోజు శిక్షణకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని, పోలీస్ బందోబస్తు కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నవీన్, తహసీల్దార్ ఘన్సీరాం, డీటీ దేవేందర్, ఆర్‌ఐ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈవీఎం గోదాం తనిఖీ
ఈవీఎం గోదాం వద్ద అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాంను త్రైమాసిక తనిఖీలో భాగంగా బుధవారం కలెక్టర్ పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదిక పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈవీఎంల రక్షణకు సంబంధించి ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


