మహబూబ్‌నగర్ న్యూటౌన్: వెనుకబడిన వర్గాలపై రోజురోజుకు దాడులు, అన్యాయాలు, వివక్షలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు సామాజిక పోరాటాలకు సిద్ధం కావాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమాల్ అన్నారు. సోమవారం దళిత హక్కుల పోరాట సమితి జిల్లా రెండో మహాసభలు జిల్లాకేంద్రంలోని సురవరం వెంకట్రామిరెడ్డి భవన్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష, సామాజిక రుగ్మతలు ఇంకా ప్రజలను పట్టి పీడిస్తుందన్నారు. హక్కులు అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. దళితులకు కేటాయించిన సబ్‌ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారన్నారు. దళితుల భూ సమస్యలు, ఉపాధి సమస్యలు, విద్యావకాశాల లోపం, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ చేయకపోవడం వంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా ఉన్నాయన్నారు. డీహెచ్‌పీఎస్ రాష్ట్ర రెండో మహాసభలను ఏప్రిల్ 17, 18వ తేదీల్లో వరంగల్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భార్గవి, పద్మావతి, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


